ఖమ్మం కమాన్‌బజార్/ కొత్తగూడెం గణేశ్ టెంపుల్, జూలై 23: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్పులు చెల్లించకపోతే సీఎం రేవంత్‌రెడ్డిని ఇంటిని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. ఉపకార వేతనాలు, బోధనా రుసుములను ఏళ్లతరబడి ఇవ్వకపోతే తాము ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్‌షిప్పులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు భద్రాద్రి, ఖమ్మం కలెక్టరేట్లను గురువారం ముట్టడించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నత చదువులు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్లలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం, గేట్ల వద్దనే విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడలో ప్రభుత్వం విఫలమైందని, విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.