కల్వకుర్తి, మే 20 : మండలంలోని గుండూర్ గ్రామస్తులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తీయడం వల్ల భూగర్భజలాలు తగ్గడంతో పాటు పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడూర్ మండలంలో ఇసుక తీయడానికి రీచ్‌కు అనుమతిస్తే గుండూర్ పరిధిలో ఎందుకు తీస్తున్నారని వారు నిలదీశారు. గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు తిరగడం వల్ల రోడ్డు ధ్వంసమవుతున్నదని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణపై ఇదివరకే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు, రైతులు వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అండతోనే ఇసుకను బాహాటంగా తీస్తున్నారని, గుండూర్ సమీపంలోని దుందుభి వాగునుంచి ఇసుకను తీయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. గ్రామస్తులు అడ్డుకోవడం తో దాదాపు 40 ఇసుక టిప్పర్లు నిలిచిపోయాయి.