రాజోళి, డిసెంబర్ 19 : తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఇసుక పంచాయితీ కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పు గార్లపాడు గ్రామ శివారులో పారుతున్న తుంగభద్ర నది నుంచి మన ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చింది. ఆన్లైన్లో అనుమతులు పొందిన వ్యాపారులు ఇసుక ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.
అయితే గురువారం ఏపీ పోలీసులు అక్కడకు చేరుకొని ఏపీ సరిహద్దు నుంచి ఇసుక తరలిస్తున్నారని అక్కడి పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. స్థానికులు రాజోళి తాసీల్దార్, ఎస్సై జగదీశ్‌కు సమాచా రం అందించడంతో వారు అక్కడకు చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు.
సరిహద్దు విషయంపై పూర్తి వివరాలు తెలుసుకొని నదిలో తెలంగాణ సరిహద్దు ఏర్పాటుతో ఇసుకను తరలిస్తామని ఇరువురు చర్చించినట్లు సమాచారం. అక్కడి నుంచి ట్రాక్టర్లో నదిలోకి వెళ్లి పరిశీలించారు. వారంలోగా రెండు రాష్ర్టాల అధికారులు పరిశీలించి సరిహద్దులను ఏర్పాటు చేస్తామని ఎస్సై జగదీశ్ తెలిపారు. ఈ సమస్యపై జిల్లా అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిపారు.