నాగర్‌కర్నూల్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది. ఈ యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడిసాయం జమవుతున్నది. ఇదిలా ఉంటే చాలామంది రైతులు ఈ పథకానికి అర్హత లేకుండా పోయినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రాజెక్టుల్లో భూములు సేకరించడంలో పెండింగ్‌లో ఉండటం వల్ల, ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాల నెంబర్లు తప్పుగా ఉండటం వల్ల కొందరు రైతులకు పట్టాలు ఇచ్చినా ఆంక్షలు ఉండటం. ఒకే సర్వే నెంబర్‌తో రెండు పాస్ పుస్తకాలు ఉండటం, భూములు విక్రయించడం వల్ల కొనుగోలు చేసిన రైతులకు పట్టా పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక, మృతిచెందిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. చాలామంది రైతులకు పట్టాపాసు పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ధేశించిన గడువులో సంబంధిత బ్యాంకు పాసుపుస్తకాలు, ఇతర జిరాక్స్ ప్రతులు అందించలేకపోయారు. ఇలాంటి రైతులు పెట్టుబడిసాయానికి దూరమయ్యారు.
గత సీజన్లలో డబ్బులు జమ అయి, ఈ సీజన్లో అసలే రాకపోయినా లేదా ఉన్న భూవిస్తీర్ణం కంటే తక్కువ భూమికి మాత్రమే డబ్బులు జమయినా రైతుబంధు పోర్టల్‌లో పేరు ఉండి బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోయినా.. ఇలా ఏ కారణాలతో డీటీబీ ఫెయిల్ అని మెసేజ్ వస్తే పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డుతో స్వయంగా ఏఈవోలను సంప్రదించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. డిసెంబర్ 20వ తేదీలోగా ధరణిలో నమోదైన వివరాల ఆధారంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఇలాంటి రైతుల వివరాలను వ్యవసాయ శాఖకు నివేదించింది. ఇలాంటి రైతులు ఖాతాలను వ్యవసాయశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై ఏఈవోలు క్షేత్రస్థాయిలో రైతులకు సమాచారం అందిస్తున్నారు. జనవరి 7వ తేదీవరకు రైతుబంధు అందని రైతులు బ్యాంకు ఖాతాలను ఏఈవోలకు అందజేయాలి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 2018నుంచి వానకాలం, యాసంగి సీజన్లలో ఈ వానకాలం నాటికి రూ.2,880కోట్ల సాయం అందింది. ఈసారి కొత్తగా 3.08లక్షల మందికి రూ.377కోట్ల సాయం అందనున్నది. అలాగే జిల్లాలో కొత్తగా 16వేల మందికి లబ్ధిచేకూరనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రైతులందరికీ ఈ సీజన్లో పెట్టుబడిసాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 20వ తేదీవరకు ధరణిలో పేర్లు నమోదైన రైతులకు కొత్తగా సాయం అందుతున్నది. రైతులకు ఏఈవోలు సమాచారం ఇస్తున్నారు. జనవరి 7వ తేదీ వరకు రైతులు బ్యాంకు ఖాతాలను ఇవ్వాలి. కొత్తగా జిల్లాలో 16వేల మంది రైతులు అర్హులు.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్