ఉప్పునుంతల, మార్చి 4 : అయిపోయిన పెళ్లికి తప్పెట్లమోత అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉన్నది. మండల కేంద్రమైన ఉప్పునుంతలలో సింగిల్విండో ఆధ్వర్యంలో సోమవారం ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు 90 శాతం పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకొని ఎంతో నష్టపోయారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాన్ని రైతులు పండించిన పంటను అమ్ముకున్న తర్వాత కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో అంతర్యమేమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
అయినప్పటికిని సదగోడు, మొల్గర, ఇప్పకుంట తదితర గ్రామాలకు చెందిన రైతులు వెంకట్రెడ్డి, బస్వారెడ్డి, లింగమయ్య తదితరులు 2000 బస్తాలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. తమ పంటకు మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో సోమవారం కిరాయి ట్రాక్టర్లలో వేరుశనగను కొనుగోలు కేంద్రానికి తీసుకవచ్చారు. తీరా చూస్తే గన్నీబ్యాగులు లేక కొనుగోళ్లు నిలిపి వేశారు. దీంతో వేరుశనగను విక్రయానికి తీసుకొచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. రెండు రోజులుగా గోదాం వద్ద గన్నీ బ్యాగుల కోసం పడిగాపులు కాస్తున్నారు. గన్నీ బ్యాగులు కొనుగోళ్లు లేనప్పుడు తమను ఎందుకు రప్పించారని సదరు అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండ్రోజుల నుంచి..
ఉప్పునుంతల గోదాం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మద్దతు ధ రతో కొంత లాభం చేకూరుతుందని సో మవారం ఉదయం 11గంటలకు రెండు కిరాయి ట్రాక్టర్లలో వేరుశనగను తెచ్చాను. గన్ని బ్యాగులు లేక కొనుగోళ్లు చేయకపోవడం వల్ల రెండు రోజులనుంచి కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నా..
– లింగమయ్య, రైతు, మొల్గర
గన్నీ బ్యాగులు కొరత ఉంది..
సకాలానికి గన్నీ బ్యాగులు రాకపోవడం వల్ల కొనుగోళ్లు చేయలేకపోయాం. రైతులు కొంత ఇబ్బందులు పడుతుండడం వాస్తవం. గన్నీ బ్యాగులు వచ్చిన వెంటనే కొనుగోలు ప్రారంభిస్తాం.
– రవీందర్రావు, సీఈవో, పీఏసీసీఎస్, ఉప్పునుంతల