గద్వాల, మార్చి 31: మీకు అండగా నేనుంటాను.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నుంచి గెలిపించి మీకు సేవ చేసే అదృష్టం కల్పించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కార్యకర్తలను కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్రం లో రైతన్నలు తాగు, సాగునీటికి నోచుకోక కరెంట్ రాక తమ పొలాల్లో కన్నీరు కార్చుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవేమీ పట్టించుకోకుండా కేకే ఇంటికి, ఢిల్లీకి పోతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం కమిట్మెంట్ ఉన్న నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కష్టాలు తెలుసుకుంటున్నాడని ఇది చూసి ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. 70ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడూ నడిగడ్డలో విద్య, వైద్యం గురించి ఆలోచించలేదన్నారు. రాష్ట్రం సిద్ధ్దించిన పదేండ్ల కాలంలోనే గద్వాలకు నర్సింగ్, మెడికల్ కళాశాలను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసి విద్యాభివృద్ధికి కృషి చేసిందన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా నడిగడ్డను బీఆర్ఎస్ సస్యశ్యామలం చేసిందని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రలోభాలకు గురి చేశారని నడిగడ్డ బిడ్డలు ప్రలోభాలకు లొంగరని చెప్పారు. కొందరు సన్నాసులు, స్వార్థపరులు ఆర్ఎస్ బహుజన ద్రోహి అం టున్నారని వారికి ఇదే నా సమాధానమన్నారు. బహుజన ద్రోహినైతే పది లక్షల మంది విద్యార్థులకు ఆంగ్లబోధన చేయించి సుమారు 400మంది విద్యార్థులకుపైగా డాక్టర్లను తయారు చేశానని బహుజన ద్రోహినైతే నా స్వార్థం నేను చూసుకుంటా కదా.. కానీ ప్రజల కోసం ఎందుకు సేవ చేస్తానని ప్రశ్నించారు. నాకు డీజీపీ స్థాయి అయ్యే వరకు అర్హత ఉన్నా ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి బహుజనుల కోసం పోరాటం చేస్తున్నాని తెలిపారు. సమాజం కన్నీళ్లు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చానే తప్పా మరోటి లేదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కొందరు ద్రోహులు కాంగ్రెస్ మాయలో పడి పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరుతున్నారని వారికి ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బరిలో నిలిచిన పార్లమెంట్ అభ్యర్థులు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీ పెద్దల ముందు ఉంచడానికి బరిలో నిలుస్తున్నారని చెప్పారు. ప్రజలు అభివృద్ధివైపు ఉంటారో అవినీతిపైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించా రు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల పట్టుకొని ప్యాకేజీలు ఇస్తూ బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి చేరికలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాక, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక వాటిని అమలు చే యాలని అడిగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు పాదాభివందనం చేస్తు న్నా నడిగడ్డ బిడ్డగా పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి తనను గెలిపించాలని ఆర్ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు గోస పడుతున్నారు : ఎమ్మెల్యే బండ్ల
గతంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన రాములు పార్టీకి ద్రోహం చేశారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. నడిగడ్డ నుంచి అధిక మెజార్టీ ఇస్తే ఏనాడు నడిగడ్డ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్నికల్లో నా విజయానికి ఎలా కృషి చేశారో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గెలుపు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి ఒక్కోక్కరు రెండు వందల ఓట్లు వేయించి లక్ష మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ మరో సారి మోసపూరిత మాట లు ప్రజలకు చెప్పి గెలుపొందాలని చూస్తుందని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారన్నా రు. పాలన పక్కన పెట్టి దోచుకొని దాచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
ప్రజలు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసి మోసపోయి ఇప్పుడు గోస పడుతున్నామని అంటున్నారని మరోసారి కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోవద్దని వేస్తే గోస తప్పదన్నారు. గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్తో సాధ్యమైందన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికి, వారిని పార్టీలో చేర్చుకోవడానికి సరిపోయిందన్నారు. ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మకుండా ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అభిలాష్‌రావు మాట్లాడుతూ గత ఎంపీ తల్లిపాలు తాగి రొమ్ముగుద్ది బీజేపీలో చేరాడని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువు వచ్చిందన్నారు. పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.