మక్తల్ టౌన్, ఆగస్టు 27 : మక్తల్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటిని అందించాలనే లక్ష్యంతో భీమా ఫేజ్-1లో భాగంగా రూ.147కోట్ల వ్యయంతో మక్తల్ మండలం సంగంబండ పెద్దవాగుపై 3.317 టీఎంసీల సామర్థ్యంతో చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో మక్తల్ మండలం సంగంబండ, మాగనూర్ మండలం ఉజ్జెల్లి, అప్పటి ఊట్కూర్ మండలం గార్లపల్లి గ్రామాల ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయారు. కాగా నూతన ఆర్ఆర్ సెంటర్లను కేటాయించి, ఇండ్లు నిర్మించుకునేందుకు అప్పటి ప్రభుత్వం అరకొరగా డబ్బులు చెల్లించి మమ అనిపించుకుంది. దీంతో ఆర్ఆర్ సెంటర్లో ఇండ్లు నిర్మించుకోలేక, పాత ఊళ్లోనే జీవనం వెళ్లదీస్తున్నారు. బాధితుల కష్టాలను గుర్తించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారు నూతన ఇండ్లు నిర్మించుకునేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే మూడు గ్రామాలకు రూ.26,35,23,410 మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. దీంతో పునరావాస గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. మక్తల్ మండలం సంగంబండ గ్రామంలో భూములు కోల్పోయిన వారికి 2011లో ప్రభుత్వమే 62 ఎకరాలను కొనుగోలు చేసి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి 673 కుటుంబాలకు, 2017లో మరో 95మందికి ప్లాట్లను కేటాయించింది. స్పెషల్ ఎకానమిక్ సర్వేలో 38మంది పేర్లు నమోదు కాకపోవడంతో వారికి ఇండ్ల స్థలాలు కేటాయించలేదు.
సర్వస్వం కోల్పోయిన వీరికి ప్రభుత్వం అందించే కూలి డబ్బులను విడుదల చేయడంతో సంగంబండలో 768మందికి రూ.11,98,91,000 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా నూతన ఆర్ఆర్ సెంటర్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కలిగింది. ఇంకా సంగంబండ పునరావాస కేంద్రంలో 47మందికి ప్లాట్లు అందించాల్సి ఉంది. మాగనూర్ మండలం ఉజ్జెల్లి గ్రామంలో 2011లో 88.80 సెంట్ల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి, నూతన ఆర్ఆర్ సెంటర్లో ఒక్కొక్కరికి 240 గజాల చొప్పున 1,176 ప్లాట్లు ఏర్పాటు చేసింది. 926 కుటుంబాలకు వీటిని అందించి 250 ప్లాట్లను కమ్యూనిటీ పర్పస్‌గా వాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో 500 కుటుంబాలకు నష్ట పరిహారం డబ్బులు మంజూరయ్యాయి. మిగతా వారికి కూడా ప్రభుత్వం ఇటీవల రూ.13,34,59,200 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఊట్కూర్ మండలం గార్లపల్లి గ్రామం రిజర్వాయర్‌లో ముంపునకు గురి కావడంతో 2011లో మక్తల్ సమీపంలో 23 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి, 240 కుటుంబాలకు నూతన ఆర్ఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 221 కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించగా.. మిగిలిన కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ. కోటీ 19,40,400 విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, స్థలాలు కోల్పోయిన ప్రతి నిర్వాసితుడి కుటుంబానికి అండగా ఉంటాం. వారి సమస్యను నా సమస్యగా భావించి వారి కోసం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తా. త్వరలోనే నేరడుగం, భూత్పూర్ ముంపు గ్రామాలకు సంబంధించిన జీఓ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే
సంఘంబండ పెద్దవాగుపై రిజర్వాయర్ నిర్మాణంలో భూములు , ఇండ్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు సీఎం కేసీఆర్ కూలి డబ్బులు చెల్లిస్తూ జీఓను జారీ చేసిండ్రు. పునరావాస కమిటీ తరఫున కేసీఆర్‌కు మా ఇబ్బందులు వివరించి కూలి డబ్బులు వచ్చేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– కోళ్ల శాంతప్ప, సంగంబండ పునరావాస కమిటీ ఉపాధ్యక్షుడు
రిజర్వాయర్‌లో సర్వస్వం కోల్పోయిన మాకు ఆర్ఆర్ సెంటర్లో ఇండ్లు నిర్మించుకునేందుకు డబ్బులు లేక రిజర్వాయర్ కట్ట దిగువలో ఉన్న పాత ఇండ్లల్లో ఉంటున్నాం. బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న మాకు ఎమ్మెల్యే చిట్టెం ప్రత్యేక చొరవతో ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది. దీంతో సొంతిళ్లు నిర్మించుకునే అవకాశం కలిగింది.
-నర్సింహ, సంగంబండ పునరావాస కేంద్రం