భూత్పూర్, ఫిబ్రవరి 12: దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మండలంలోని అమిస్తాపూర్కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలైన ఘటన కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబీకుల కథనం మేరకు.. అమిస్తాపూర్లోని ఒకే కుటుంబానికి చెందిన బత్తుల వంశీకృష్ణ(29), భార్య బిందేశ్వరి, హస్నాపూర్కు చెందిన గొల్ల నరేశ్(30) మహబూబ్నగర్ పట్టణంలోని బోయపల్లికి చెందిన కృష్ణవేణి, హన్మంతు, రాము, వెంకటేశ్ శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి కారులో బయలుదేరి వెళ్లారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంలో కారుకు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బత్తుల వంశీకృష్ణ, గొల్ల నరేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. వారి వెంట వెళ్లిన వారికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.