మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల/బాలానగర్, జనవరి 5 : బాలానగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. అభం.. శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం కింద నలిగిపోయారు. బాలానగర్‌లో జరిగిన సంతకు వచ్చిన మోతిఘణపూర్, బీబీనగర్‌తోపాటు పలు గ్రామాలు, తండా వాసులతోపాటు బీహార్‌కు చెందిన కూలీలు సైతం విగత జీవులుగా మారారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు టైర్ల లోడ్‌తో వేగంగా వెళ్తున్న డీసీఎం (ఏపీ 03 పీఏ 5898) కంట్రోల్ తప్పింది. మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను, రోడ్డు దాటుతున్న ఐదుగురితోపాటు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరితోపాటు రోడ్డు క్రాస్ చేస్తున్న ఐదుగురు ప్రమాదానికి గురయ్యారు. బీబీనగర్ తండాకు చెందిన జున్ను(3), ఫణి (50), మోతిఘనపూర్కు చెందిన తల్లీబిడ్డలు పింకి అలియాస్ మోక్ష(8), సునీత(32), బాలానగర్‌కు చెందిన జశ్వంత్(10) అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యప్రదేశ్‌కు చెందిన భద్రాసింగ్, బీబీనగర్ తండాకు చెందిన మౌనిక తీవ్రంగా గాయపడగా.. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. మౌనిక చికిత్స పొందుతుండగా.. భద్రాసింగ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆదేశించారు.
ఐదుగురు ప్రాణాలు కండ్ల ముందే గాలిలో కలిసిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. కొద్ది దూరం వెళ్లాక స్థానికులు కేకలు వేయడంతో డీసీఎంను నిలిపి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల్లో ఆవేశం కట్టలు తెంచుకోవడంతో డీసీఎంకు నిప్పు పెట్టారు. మంటల్లో వాహనం పూర్తిగా కాలిపోయింది.
బాలానగర్‌లో రోడ్డు ప్రమాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదుపులోకి తీసుకోవడానికి అక్కడకు బాలానగర్ పోలీసులు చేరుకున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని జడ్చర్ల రూరల్ సీఐ జములప్పకు వివరించగా.. ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలానగర్, రాజాపూర్ ఎస్సైలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌తో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఆగ్రహించిన గ్రామస్తులు వారితో గొడవపడి దాడి చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి తలోదిక్కు పారిపోయా రు. పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అంతసేపు స్థానికులు హైవేను దిగ్బంధించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వచ్చి బాధితులకు న్యాయం చేయాలని భీష్మించుకూర్చున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఎస్పీ నరసింహ, డీఎస్పీ అదనపు బలగాలతో బాలానగర్‌కు చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఘోరరోడ్డు ప్రమాదం జరగడంతో స్థానికులు, మృతుల బందువులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన డీసీఎం ను దహనం చేశారు. స్థా నికులు, మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల బంధువులు, స్థానికులతో చర్చించినా ఎవరూ వినిపించుకోలేదు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రా వాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారు వచ్చే వరకు రోడ్డుపైనుంచి వెళ్లేది లేదని, ఎస్సై డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తు రోడ్డుపైనే ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నారు. చేయడంతో రోడ్డుకు ఇరువైపులా రెండు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దాదాపు 15కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బాలానగర్‌కు చెందిన జస్వంత్(6) తన పుట్టిన రోజు ఉండటంతో కేక్ తీసుకురావడానికి సంతబజార్‌కు వచ్చాడని తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురై మృ త్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో జశ్వంత్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంతో మోతిఘనపూర్, బీబీనగర్, బాలానగర్‌లలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూరగాయలు, ఇతర వంటింటి వస్తువులను కొనుగోలు చేయడానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలానగర్ రోడ్డు ప్రమాదం తనను కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 5 : రోడ్డు ప్రమాదంలో ఐదుమంది దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన బాలానగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. మృతదేహాలతోపాటు గాయపడిన వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఒకరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తలరించగా మరొకరికి ఇక్కడే చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న కలెక్టర్ రవినాయక్ ప్రభుత్వ దవాఖానకు వెళ్లి మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్‌ను ఆదేశించారు.