జోగులాంబ గద్వాల : పాలనలో పారదర్శకత కోసమే 2005 లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ (Information Act) కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు (Commissioner PV. Srinivas Rao) అధికారులకు సూచించారు. శుక్రవారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టంపై పీఐవో, అపిలెట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని అన్నారు. ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాల్లో జోగులాంబ గద్వాల జిల్లా ఒకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి, పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా, చట్టంలో ఉన్న సమయపరిమితి లోపల సమాధానమివ్వాలని ఆదేశించారు.
మూడు సంవత్సరాల నుంచి 17వేల ఆర్టీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల్లో పర్యటనలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో పర్యటించి కేసులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పారదర్శకమైన పాలన కోసం చట్టం ఉపయోగపడాలని, ప్రజలు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సదుద్దేశంతో వినియోగించుకోవాలన్నారు.
అధికారులు చట్టం పట్ల భయం విడనాడి నిర్భయంగా యాక్ట్ ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందజేయాలని తెలిపారు. చట్టం అమలులో మన దేశం ప్రపంచ స్థాయిలో 8వ స్థానంలో ఉన్నదని, రాబోయే రోజులలో నెంబర్ వన్‌గా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ యాక్ట్ లో 31 సెక్షన్లు ఉన్నాయని, సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాలో గత సంవత్సరం నుండి ఆపరిష్కృతంగా ఉన్న ఆర్టీఐ అప్పీల్ కేసులను కలెక్టరేట్లో కమిషన్ ప్రత్యేకంగా పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్, శ్రీమతి వైష్ణవి మేర్ల అధికారులకు ఆర్టీఐ యాక్ట్ పై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, వివిధ శాఖల పీఐవోలు, అప్పీలెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.