మక్తల్, ఆగస్టు 21 : మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీళ్లు అందించాలని చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. కాగా, తమకు ప్రభుత్వం అందించే రూ.14లక్షల పరిహారం అవసరం లేదని, ప్రతి నిర్వాసితుడికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసేలా నోటీసులను కొత్తరకంగా వాట్సాప్లో పంపించారు. మారెట్ విలువ ప్రకారం రూ.40 నుంచి రూ.70లక్షలకు ఎకరా పలికే భూములకు ప్రభుత్వం రూ.14లక్షలు ఇస్తూ భూమిని అప్పజెప్పాలని అధికారులు ఒత్తిడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సంతకాలు పెడతారా లేక కేసులు నమోదు చేయాలా అంటూ ఇటు పోలీస్, అటు రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న ట్లు రైతులు వాపోతున్నారు.
కాచ్వార్లో రెవెన్యూ అధికారులు గురువారం రైతుల ఇంటింటికి వెళ్లి బలవంతంగా ఆర్డర్ కాపీలను అందించేందుకు చర్యలు చేపట్టారు. రైతులు నోటీసులు తీసుకోకపోవడంతో వాట్సాప్ ద్వారా నోటీసులను జారీ చేసి సంతకాలు సేకరించినట్లు రికార్డులు నమోదు చేసుకొని వెళ్లిపోయినట్లు బాధితులు వాపోయారు. కాగా, తమకు న్యాయమైన పరిహారమిచ్చే వరకు ఎటువంటి బెదిరింపులకు లొంగేది లేదని రైతులు తేల్చిచెప్పారు.