ఆత్మకూరు, ఆగస్టు 25 : ఆత్మకూరు తాసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహులు రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణాగౌడ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గట్టన్న మోట్లంపల్లి శివారులోని 217, 2018, 220, 221 సర్వేనంబర్లలోని రెండెకరాల 26గుంటల
భూమి ఆయన వారసులు నాగప్ప, మాబన్న, ఆంజనేయులు పేర్లపై మార్పిడి చేసేందుకు ఆర్ఐ నర్సింహులుని సంప్రదించాడు. నెలలుగా తిరుగుతున్నా ఆర్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో బాధితులు అదే పట్టణానికి చెందిన జానకిరాములుతో కలిసి ఆర్ఐని సంప్రదించారు. ఇందుకు ఆర్ఐ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని, రూ.5వేలు ఇస్తామని బాధితులు హైదరాబాద్ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.
శుక్రవారం ఏసీబీ అధికారుల సూచన మేరకు జానకిరాములు ఆర్ఐకి రూ.5వేలు లంచం ఇస్తుండగా దాడులు నిర్వహించి ఆర్ఐ వద్ద రూ.5వేలు రికవరీ చేసుకొని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ స్పెషల్‌కోర్టు నాంపల్లిలో నివేదించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఏ అధికారి అయినా లంచం అడిగితే ఏసీబీని సంప్రదించాలని డీఎస్పీ కోరారు. టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కు ఫిర్యాదు
చేయవచ్చని సూచించారు. ఈ విషయమై తాసీల్దార్ రాజును వివరణ కోరగా, తనకెలాంటి సమాచారం తెలియదని తెలిపారు. దాడుల్లో ఎస్సైలు సయ్యద్ జిలానీ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, గతంలోనూ వివిధ పనుల కోసం వెళ్లిన ప్రజలకు ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.