మరికల్ : తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ ( Pharmacity) రద్దుచేసి ఫోర్త్ సిటీ( Fourth City) పేరుతో పేదల భూములను పెద్దలకు కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabadram ) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మరికల్ మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
గతంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టిన పాదయాత్ర ద్వారానే నారాయణపేట కొడంగల్ ( Kodangal Project ) ప్రాజెక్టుకు మోక్షం లభించిందని అన్నారు. ఈ పాదయాత్రలో నాడు తనతో కొడంగల్లో రేవంత్ రెడ్డి అడుగులేసారని ఆ సందర్భంగా గుర్తు చేశారు. పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తానని మాట ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను అధికారపక్షంలోకి వచ్చిన రేవంత్ నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని అన్నారు. మహిళలకు రూ. 2,500 ఇవ్వలేదని, కేవలం ఉచిత బస్సు తోనే హామీలు అమలు అయినట్టు ప్రకటించుకోవడం తగదని అన్నారు. నారాయణపేట జిల్లాతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరుతో పేదల భూములు లాక్కోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు రోజువారి కూలీ రూ. 600 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల వలసలను అరికట్టాలని కోరారు. భూభారతి ద్వారా పేదల భూములు కాజేసి పెద్దలకు అప్పజెప్పాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో భీమ్రాజ్ వెంకట్ రాములు, ఏఐఏడబ్ల్యూ జిల్లా కార్యదర్శి గోపాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ , రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ , రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగయ్య , సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి , రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ , రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు , రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ , ఆంజనేయులు, భరతమాల,. భూ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం,రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య పాల్గొన్నారు .