అమ్రాబాద్, ఫిబ్రవరి 16: ఈనెల 26న మహాశివరాత్రి సందర్భంగా చెక్‌పోస్టు వేళలలో సడలింపు ఇస్తున్నట్లు అటవీ శాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి ఆదివారం తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గల మన్ననూర్ చెక్ పోస్ట్ ఈనెల 19 నుండి మార్చి ఒకటో తేదీ వరకు చెక్ పోస్ట్ 24 గంటలు తెరిచి ఉంటుందని అన్నారు. యాత్రికులు ఈ విషయాన్ని గమనించి ఎప్పుడైనా రావచ్చునని తెలిపారు. అలాగే అడవి గుండా అధిక వేగంతో వెళ్లకూడదని వన్యప్రాణులకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వస్తువులు అడవిలో పడవేయరాదని ఆయన తెలిపారు. గతంలో రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు చెక్ పోస్టు మూసి ఉండేనన్నారు. ఈ సడలింపుపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పాదయాత్రతో వస్తున్న భక్తులు రాత్రి సమయాల్లో అడవి గుండా నడవకుండా చూసుకోవాలని ఆయన హితవు చెప్పారు.