మక్తల్‌టౌన్, జూన్ 13: తెలంగాణ ఏర్పాటు అనంతరం మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జెడ్పీ సీఈవో జ్యోతి అధ్యక్షతన మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన, బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం సీడీపీవో సరోజినీ ప్రగతి నివేదికను చదివి సభాముందు ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. ఉమ్మడి పరిపాలనలో మహిళా సంఘాలకు రుణాలు అరకొరగానే వచ్చేవని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలను ఆర్థికంగా స్థిరపర్చాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు రూ.5లక్షల వరకే పరిమితమైన రుణాలను రూ.20లక్షల వరకు పెంచారని పేర్కొన్నారు. మక్తల్ నియోజక వర్గంలో 159 గ్రామ సంఘాలు, 3,602 స్వయం సహాయక సంఘాల్లోని 41,358 సభ్యులకు సంస్థాగత నిర్మాణానికి సామర్థ్యాల పెంపుతో పటిష్ట నిర్మాణం జరిగి మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధిని కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలోని ఏడుమండలాల్లో 3,095 మహిళా సంఘాలకు 143.18 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా 96 స్వయం సహాయక సంఘాలకు రూ.8కోట్లు, 77సంఘాలకు స్త్రీనిధి నుంచి రూ.2కోట్ల చెక్కును అందజేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ సేవలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆర్యోలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు పిల్లలకు ప్రతిరోజూ పోషకాహారం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్ల జీతాలను పెంచుతూ నెలనెలా జీతం వచ్చేవిధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా డీఆర్డీఏ శాఖలో 15, మహిళా సమాఖ్యలో వీవోఏ 25, ఉత్తమ మహిళా సంఘాల్లో 7, మండల సమాఖ్యలో 7, ప్రజాప్రతినిధులు 14మంది మహిళలను ఘనంగా సత్కరించారు.
మాజీ ఎమ్మెల్యేకు నివాళి
మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ దినోత్సవంలో దయాకర్‌రెడ్డి ఆత్మశాంతించాలని 2నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో దేవరి మల్లప్ప, జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎంపీపీలు వనజ, లక్ష్మి, పూర్ణిమ, శ్యామలమ్మ, జెడ్పీటీసీలు జ్యోతి, వెంకటయ్య, అశోక్‌గౌడ్, ఎంపీడీవోలు శ్రీధర్, శ్రీనివాస్, ఏపీఏంలు, ఈవోపీఆర్డీలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.