నాగర్ కర్నూల్: జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ వద్ద ఆదివారం సైతం సహాయక చర్యలు కొనసాగాయి. పండగపూట సైతం రెస్క్యూ బృందాలకు రిస్కు తప్పలేదు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారు. టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీసులో సహాయక బృందాల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ సహాయక చర్యలలో పాల్గొంటున్న సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా వివిధ రకాల నిష్ణాతులైన సిబ్బందిని, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు, మొదటి రోజు నుంచే టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ చేయగల ఆర్మీ సిబ్బంది, అన్ని రకాల నిష్ణాతులను, సాంకేతికతను ఉపయోగించుకుంటూ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి రోజూ నిరంతరాయంగా కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ, పలు సూచనలు, సలహాలు అందజేస్తూ సహాయక పనులను వేగవంతం చేస్తున్నామని వివరించారు.
నిర్విరామంగా డీ – వాటరింగ్, ప్రక్రియలను చేపడుతూ , సహాయక పనులకు ఆటంకంగా వున్న స్టీల్ ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నేల్ బయటికి తరలిస్తున్నామని, సొరంగంలోపల అత్యధికంగా ఉన్న మట్టీనీ తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దేవ సహాయం, ఎన్డిఆర్ ఎఫ్ అధికారి కిరణ్ కుమార్, ఎస్ డిఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, సింగరేణి మైన్స్ రిస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేటి చంద్ర, హైడ్రా అధికారులు తదితరులు పాల్గొన్నారు.