గద్వాల/అయిజ/, సెప్టెంబర్ 14 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 52,800 కూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి దిగువకు 58,435 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 9.070లుగా ఉన్నది.
జూరాల ఎడమ కాల్వకు 730, కుడి కాల్వకు 630, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-2కు 750, సమాంతర కాల్వకు 850 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా విద్యుదుత్పత్తికి 38,849 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 32,690, అవుట్ ఫ్లో 28,628 క్యూసెక్కులుగా ఉన్నది. నీటి మట్టం 129.72 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 128.01 టీఎంసీల నిల్వ ఉన్నది.
నారాయణపుర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 29,189, అవుట్ ఫ్లో 26,318 క్యూసెక్కులు ఉన్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 21,950, అవుట్‌ఫ్లో 21,356 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 101.656 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 20,631, ఆయకట్టుకు 631 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 9.7 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నది.