మట్టిలో పుష్కలంగా సూక్ష్మపోషకాలు
రసాయన ఎరువులతో పంటకు నష్టం
పెద్దమందడి, మే 22 : ప్రస్తుతం వ్యవసాయమంతా రసాయనాల మయమైంది. పొలాల్లో సారం లేక రైతులు రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. దీంతో భూమిలో సారం తగ్గిపోయి పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సేంద్రియ ఎరువులు తగ్గిపోతున్నాయి. భూమిలో పోషక సారం పెంచేందుకు చెరువులు, కుంటల్లోని ఒండ్రుమట్టిని తరలించడం ఎంతో లాభం. చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రసాయన ఎరువులకు మించిన పోషకాలు ఒండ్రుమట్టిలో ఉంటాయి. ఈ మట్టిని పొలాల్లో వేసుకోవడంతో భూములు సారవంతమై పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రస్తుతం గ్రామాల్లోని చెరువుల్లో నీరు తగ్గిపోవడంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీల సాయంతో రైతులు ఒండ్రుమట్టిని ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పామిరెడ్డిపల్లి, పెద్దమందడి, దొడగుంటపల్లి గ్రామాల్లోని రైతులు తమ పొలాలకు ఒండ్రుమట్టిని తరలిస్తున్నారు.
ఈ మట్టిని పొలాల్లో వేయడం ద్వారా నేల సారవంతమై అధిక దిగుబడి రావడంతోపాటు గింజలు కూడా బరువుగా ఉంటాయని రైతుల నమ్మకం. వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు ఎత్తైన ప్రదేశాల నుంచి వచ్చే వరదతోపాటు ఇసుక, బంకమ ట్టి, ఒండ్రుమట్టి, వివిధ ప్రాంతాల్లో కుల్లిన వ్యర్థపదార్థాలన్నీ చెరువులో చేరి అడుగు భాగాన ఎరువుగా తయారవుతుంది. పంటలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరంతోపాటు సూక్ష్మపోషకాలు అందులో ఉంటా యి. ఒండ్రుమట్టిని పొలాల్లో చల్లడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో రసాయన ఎరువుల వినియోగం పూ ర్తిగా తగ్గించుకోవచ్చు.
భూసారం పెరుగుతుంది
చెరువులోని ఒండ్రుమట్టిని పొలాల్లొ చల్లుకుంటే భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. అవకాశం ఉన్న రైతులందరూ ఒండ్రుమట్టిని పొలాల్లో వేసుకునేందుకు మొగ్గు చూపాలి. ఒండ్రుమట్టి, ఇసుకను చౌడుపొలాల్లో వేస్తే ఎంతో మంచిది. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ఒండ్రుమట్టితోపాటు పశువుల పేడ వాడితే మంచి దిగుబడులు వస్తాయి. – సంతోషి, ఏవో