నెట్వర్క్, నమస్తే తెలంగాణ 9: అన్నాదమ్ముళ్లు.. అక్కాచెల్లెల్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ.. నేను నీకు రక్షా.. నువ్వు నాకు రక్ష అనే నానుడితో ఒకరికొకరు ప్రేమానురాగాలను పంచుకు నే పండుగ వేడుకలను శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టి మధురమైన తీపిని పంచారు.
ప్రజలతోపాటు పలువురు రాజకీయ నేతలు, అధికారులు సైతం వేడుకల్లో పాలుపంచుకొన్నారు. వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఆయన సోదరి రాఖీ కట్టారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఆయన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి స్వీటు తినిపించారు.
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఆయన సోదరి గీత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన వచ్చిన మహిళలు, యువతులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. బస్సుల్లో రద్దీ అధికంగా ఉండడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.