రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికతోనే నిలిచిపోయింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే లో దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం రుణాల ఊసే ఎత్తడం లేదు. అప్పట్లో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు ఇస్తామని హంగామా చేసిన రేవంత్ సర్కారులో ఆ తర్వాత చలనం లేకుండా పోయింది. వచ్చిన దరఖాస్తులను ఇప్పుడు కాదు అప్పుడంటూ పరిశీలన చేసి అసలు ప్రక్రియను పక్కకు పెట్టేసి రాజీవ్ యువ వికాసంలో యువతను నిరు త్సాహానికి గురి చేస్తోంది.
వనపర్తి, జూలై 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల నుంచి 26,158 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిందే తడవుగా భా రీగా యువత దరఖాస్తులకు ఎగబడ్డారు. ఏడాది కింద ట మొదలైన ఈ ప్రక్రియలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లుగా కనిపించినా.. ఎట్టకేలకు సర్కారు పూర్తిగా వదిలేయడంతో యువత నిరుత్సాహానికి గురవుతుంది. తమ దరఖాస్తులు ఏమయ్యాయంటూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటిగా మారింది. ఎన్నో ఆశలతో సబ్సిడీ రుణాలు అందుతాయని దరఖాస్తులు చేసుకుంటే చివరకు నిరాశ ఎదురైందని యువత వాపోతున్నారు.
నాలుగు రకాల రుణాలతో..
యువ వికాసం ద్వారా నాలుగు రకాల రుణాలిచ్చేందుకు నిర్ణయించారు. రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు, రూ.4లక్షల లెక్కన లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ల వారీగా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన వర్గాలకు చేయూ త నిచ్చేందుకు ఆయా కార్పొరేషన్ల ద్వారా యువతకు రాయితీపై రుణాలు గత ప్రభుత్వాలు మంజూరు చేసే వి. ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కార్పొరేషన్లను అన్నిటిని ఒకే గొడుగు కిందకు తెచ్చి రాజీవ్ యువ వికాసం కింద రాయితీ రుణాలివ్వడానికి నిర్ణయించింది. అయితే, ఈ పథకం ద్వారా వీరిలో ఏ ఒక్కరికీ రుణం పంపిణీ చేయకపోవడంతో యువత నిరుత్సాహంలో పడుతుంది. కాగా, ఈ పథకంలో భాగంగా కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న రూ.50వేల రుణానికి వంద శాతం సబ్సిడీ ఉంటే, రూ.లక్ష వరకు 90 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందిన వారికి 70 శాతం సబ్సిడీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అడ్రస్ లేని సబ్సిడీ విడుదల
ఆఘమేఘాలపై దరఖాస్తులు చేయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. హడావుడి చేసినంతలో ఇసుమం తా కూడా పని జరగడం లేదు. దరఖాస్తులు చేసుకున్న వారిలో కొన్ని ఎంపికలు కూడా పూర్తి చేశారు. అయితే, అప్పట్లోనే సబ్సిడీలు విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు వాటి ఊసే లేకపోవడంతో ఈ రుణాలు అందేనా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలను నిర్వహించారు. అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇవ్వాలని కూడా నిర్ణయించి చివరకు చేతులెత్తేశారు. ఈ పరిస్థితిలో నిరుద్యోగ యువత గంపెడాశతో చేసుకున్న దరఖాస్తులు చి వరకు చెల్లకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు. బీసీ అభివృద్ధి శాఖ ద్వారా 16,731 మంది దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6,181 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2,677 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 440, క్రిష్ట్రియన్లు 29మంది దరఖాస్తులు చేసుకున్నారు.
ప్రభుత్వం సహకారమందించాలి
సబ్సిడీపై రుణాలు ఇస్తామంటే దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. దాదాపు ఏడాదిన్నర అవుతుంది. గొర్రెల పెంపకం కోసం దరఖాస్తు పెట్టుకున్నా. ప్రభుత్వం సహకారమందించి మమ్మల్ని ఆదుకోవాలి. సబ్సిడీ రుణాలందిస్తే.. ఆర్థికపరంగా మేం నిలదొక్కుకుంటాం.
– బోరెల్లి ఆంజనేయులు, గోవర్ధనగిరి, వీపనగండ్ల మండలం
ఏడాది దాటిపాయే..
ఇస్తామంటే ఎవరికైనా ఆశ. ప్రభుత్వం చెప్పిన వెంటనే దరఖాస్తు చేసుకున్నాం. దాదాపు ఏడాది గడిచింది. ఎవరిని అడిగినా సమాధానం లేదు. కిరాణ షాపు కోసం దరఖాస్తు చేశాను. ఈ పథకం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు.సబ్సిడీపైన రుణాలు కల్పించి ఉపాధి కల్పిస్తామంటే సంతోషించాం. కానీ, ఇప్పటి వరకు అతిగతీ లేకపోవడమే బాధ కల్గిస్తుంది. నా లాగా దరఖాస్తు చేసిన చాలా మంది నిరాశలోనే ఉన్నారు.
– జనార్దన్, గోవర్ధనగిరి, వీపనగండ్ల మండలం