నారాయణపేట, ఏప్రిల్ 1 : హైడ్రా పేరుతో జనాల వద్దకు వెళితే పొట్టు పొట్టుగా తిడుతుండడం వల్లే మూగ జీవాలున్న ప్రాంతానికి వెళితే అవి ఎలాగో తిట్టలేవనే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి సర్కారు ఎలాగైనా భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నట్లుగా ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటన స్పష్టం చేస్తున్నదని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు.
హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు వందల మంది విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం తరఫున ఒక మంత్రి గానీ, అధికారి గానీ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సింది పోయి అక్రమంగా రాత్రికి రాత్రి వందల సంఖ్యలో బుల్డోజర్లను రప్పించి భూములను చదును చేసే పనులకు శ్రీకారం చుట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బుల్డోజర్లను అడ్డుకోబోయిన విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇదే యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన రేవంత్‌రెడ్డికి అప్పుడే హైదరాబాద్ సెంట్రల్ యూన్సివర్సిటీ భూములపై కన్ను పడిన విషయం 15నెలల తర్వాత ఇప్పుడిప్పుడే స్పష్టమవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి తీరు ఇలాగే కొనసాగితే ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ప్రజలు, విద్యార్థులు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ ఆడటం ఖాయమన్నారు. ఇప్పటికైనా సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.