మాగనూరు,అక్టోబర్ 23 : ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిందని ము రిసేలోపే వరుణ దేవుడు కన్నీళ్లు మిగిల్చాడు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరిపైరు నేలకొరిగి గింజలు నేలరాలాయి. పంటలో నీళ్లు అధికంగా చేరడంతో చేసేది లేక రైతులు అదే పంటలో కూర్చొని బోరున విలపించారు. మాగనూర్, కృష్ణ మండలంలోని పలు గ్రామాల్లో కోతకొచ్చిన వరి పంట ఈదురుగాలలు, వర్షానికి నేలకొరిగింది.
ఎకరానికి రూ.40వేల వరకు పెట్టుబడితో సాగు చేయగా, పంటచేతికొచ్చే సమయంలో నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై మాగనూర్ మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్ను బుధవారం వివరణ కోరగా, పంట నష్టం వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
మూసాపేట, అక్టోబర్ 23 : మూసాపేట మండలంలోని నిజాలాపూర్కు చెందిన రైతు లక్ష్మయ్య మూసాపేట శివారులో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. కౌలు, పెట్టబడి కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.1,80,000 ఖర్చయినట్లు తెలిపాడు. పంటను మిషన్తో కొత చేయించి కల్లంలో ఆరబెట్టాడు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం నీటిపాలమైంది. ధాన్యంలో భారీగా చేరిన నీటిని తొలగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అయిన ప్పటికీ తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవని బాధిత రైతు వాపోతున్నాడు. కాగా, కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయకపోవడంతో చాలా చోట్ల ధాన్యం నిల్వకు స్థలం లేక అకాల వర్షాలకు వర్షార్పణం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు.