మహబూబ్‌నగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న కారును 180 కిలోమీటర్ల వేగంతో బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ యూబీ గార్డెన్లో ఓ ఫంక్షన్‌కు జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతానికి చెందిన వారు హాజరై తిరిగి కారులో బయలుదేరారు. అయితే అర్ధరాత్రి సమయంలో బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు యూటర్న్ తీసుకుంటుండగా.. క్రిస్టియన్‌పల్లి నుంచి అతివేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ రైడర్ ఢీకొన్నాడు.
దీంతో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న పాలమూరుకు చె ందిన సారాబేగం(30), అబ్దుల్ అలియాస్ అమర్ (2), అహ్మద్ (8)తోపాటు హైదరాబాద్‌కు చెందిన బైక్ నడుపుతున్న మహమ్మ ద్ ఓవైస్ (30)తోపాటు వెనుక ఉన్న అఫ్జల్ యాకూబ్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని రేష్మ గౌసియాలకు తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించిందని పాలకొండ డివిజన్ ప్రజలు తెలిపారు. కాగా బైపాస్‌లో హైదరాబాద్‌కు చెందిన 22 మంది బైక్ రేసర్లు ఓవర్ స్పీడ్‌తో బెట్టింగ్ నిర్వహించి బైకులు నడిపినట్లు ప్రాథమిక సమాచారంలో తేలింది. ఈ బైక్ రైడర్లంతా హైదరాబాద్‌కు చెందిన ఉన్నత వర్గాల కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన గంటలోనే కొంతమంది పోలీసు అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఘటనా స్థలికి చేరుకోవడం.. బైక్ రైడర్లపై కేసులు వద్దని బేరాసారాలకు దిగడం సంచలనం కలిగిస్తోంది. కొద్ది రోజులుగా బైపాస్‌పై అర్ధరాత్రుల బైపాస్‌లో బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమో దు కాగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హుటాహుటిన జిల్లా దవాఖానకు వెళ్లి మార్చురీలోని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం తీవ్ర గాయాలైన వారి క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం కోల్పోయిందని.. బాధితులకు రూ.50లక్షల నష్టపరిహారం అందించి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పాలమూరు బైపాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ రేసర్లు అంతా హైఫై కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో వారిపై కేసులు నమోదు కాకుండా రాత్రికి రాత్రి సెటిల్మెంట్ జరిగినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరగగా సమీప పోలీస్ స్టేషన్లలోని ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు.. మరి కొంతమంది పోలీసులు మిగతా బైక్ రైడర్లను అక్కడి నుంచి పంపించడం.. వారిపై కేసు కాకుండా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదం జరిగినప్పుడు డీఎస్పీ, రూరల్ సీఐ ఇద్దరు కూడా సెలవులో ఉన్నారు. దాదాపు 25 లక్షల పైచిలుకు గల స్పోర్ట్స్ బైకులు ఈ రేసింగ్‌లో పాల్గొనడం చూస్తుంటే.. సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తులే అయి ఉంటారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం బైపాస్‌లో జరిగిన ప్రమాదంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.