మహబూబ్నగర్ విద్యావిభాగం, డిసెంబర్ 2 : సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన సరుకులతో పౌష్టికాహారం అందిస్తూ.. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంటే.. విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియాను లోపలికి అనుమతించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్బాబు ప్రశ్నించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని పలు విద్యా సంస్థలను బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లు కలెక్టర్ అనుమతితోనే విద్యా సంస్థల్లోకి రావాలంటూ నాయకులకు సూచించారు. ఆయా విద్యాలయాల ప్రధాన గేటు, ముఖద్వారం ఎదుట కలెక్టర్ అనుమతి లేకుంటే పాఠశాలలోకి ప్రవేశం లేదంటూ ఫ్లెక్సీలు, నోటీసు బోర్డుల్లో రాసి ఉంచారు. ఈ విషయంపై పలువురు ప్రిన్సిపాళ్లను విద్యార్థి సంఘాల నాయకులు నిలదీస్తే తమకు రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయంటూ చెప్పారు. కొన్ని చోట్ల విద్యార్థి సంఘాల నాయకులను గేటు ముందే నిలిపి విద్యార్థులతో మాట్లాడించారు. మరికొన్ని చోట్ల గేట్లు తీయకుండానే అన్ని సక్రమంగా అందిస్తున్నామని సిబ్బంది చెప్పారు.
బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాల, ఎస్సీ బాలికల వసతి గృహం, పిల్లలమర్రిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను, రామిరెడ్డిగూడెంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాల, ధర్మాపూర్లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల-జడ్చర్ల, హన్వాడలోని కేజీబీవీ, మహాత్మాజ్యోతిభాఫూలే బాలికల పాఠశాలను సందర్శించారు. పలు విద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్, వినయ్, భరత్, బాలునాయక్, వెంకటేశ్ నాయక్, ప్రమోద్, వినయ్ పాల్గొన్నారు.