లింగాల, సెప్టెంబర్ 7 : గత పదేళ్ల పాలనలో చేసి న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల గుండెల్లో నిలిచినందుకే ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనంలో కేసీఆర్ దేక్లింగే సాంగ్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నృత్యాలు చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా మండల ఆయా గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు , కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మగ్దూంపూర్ చౌరస్తాలోని శ్రీనివాస పద్మావతి ఫంక్షన్ హాల్లో మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. రాష్ర్టాన్ని అభివృద్ధి ప థంలో నడిపించడానికే బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా స్థాపించారని గుర్తుచేశారు. ఎన్నడూలేని విధంగా యూరియా కొరత సృష్టించి రైతులను రోడ్డు న పడేశారని విమర్శించారు. యూరియా కష్టాలు తీర్చకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని డిమాండ్ చేశారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి చేతగాక బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ మంత్రు లు, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని బీజేపీ నాయకులు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రం, దేశాన్ని ఆగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే సీఎం రేవంత్‌రెడ్డికి కుర్చీపోతందనే భయం పుట్టుకొచ్చిందని మాజీ ఎ మ్మెల్యే, నియోజక వర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 వాగ్ధానాల ను చేసి అధికారంలోకి వచ్చిన సీఎం 21నెలలు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ రా జ్యం అని చెప్పి కొట్లాట రాజ్యాన్ని తెచ్చారని విమర్శించా రు. ఇందిరమ్మ ఇండ్లను పార్టీ కార్యకర్తలకే మంజూ రు చేసి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళానికి మండలంలోని ఆయా గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలి వచ్చారు. దీంతో మండల కేంద్రం గులాబీమయం గా మారింది. తప్పట దరువులతో నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జగపతిరావు, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు పోకల మనోహర్, మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, మాజీ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రానోజీ, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటగిరి, బీఆర్ఎస్ నాయకులు శంకర్‌నాయక్, ఎల్లేశ్, హన్మంతునాయక్, సేవ్యనాయక్, నర్సింహగౌడ్ పాల్గొన్నారు.
కల్వకుర్తి, సెప్టెంబర్ 7 : కృత్రిమంగా తయారు చేసే బీరు కేంద్రాలు తెరిచి గీత కార్మికులు పొట్ట కొట్టవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సహజ సిద్ధంగా దొరికే నీరా కేంద్రాలను ప్రోత్సహించి గీత కార్మికులకు చే యూత నివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలోని కృష్ణయ్యగౌడ్కు చెందిన ఈత, ఖర్జూర వనాలను మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్నాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో కి వస్తే గీత కార్మికులకు గ్రామానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వడంతోపాటు ఆదాయ మార్గాలు పెంచుతామని హమీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.