మహబూబ్‌నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ప్రారంభమవుతున్నా సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌ను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతు న్నా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయడంలో అధికారుల అలసత్వం స్ప ష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడం.. ఇరిగేషన్ శాఖకు ఇవ్వాల్సిన నిధులు అందకపోవడంతో అధికారులు మరమ్మతులు చేయలేక చేతులెత్తేశారు.
ఫలితంగా జిల్లాలోని అనేక ప్రధాన ప్రాజెక్టుల కాల్వలు రిపేర్లు లేక అధ్వానంగా మారాయి. పాలమూ రు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టుకు ఏటా మెయింటెనెన్స్ చేపట్టేవారు. చిన్నచిన్న రిపేర్లన్నీ చేసి వ ర్షాకాలంలో ప్రాజెక్టు నిండాక గేట్లు ఎత్తి కాల్వలకు నీళ్లు సరఫరా చేసేవారు. ఇదంతా ఎండాకాలంలోనే జరిగేది. ప్రతి యేటా యాసంగి ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని కాల్వల ద్వారా తరలిస్తా రు. మార్చి తర్వాత అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్‌లో కి వెళ్లిపోయేవి. ఈసారి కొత్త ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరమ్మతులు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి.
ఉమ్మడి జిల్లాలోని కృష్ణానది బేసిన్లో జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద లక్ష ఎకరాలు, సమాంతర కెనాల్ కింద 50 వేల ఎకరాలు, భీమా మొ దటి రెండు కాల్వల కింద రెండులక్షల ఎకరాలు.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూడులక్షల ఎకరాలు.. కోయిల్‌సాగర్ పథకం ద్వారా 50వేల ఎకరాలు.. నెట్టెంపాడు కింద లక్ష ఎకరాలు సాగవుతాయి. అలాగే తుంగభద్రా నది కింద ఆర్డీఎస్ ప్రధాన కాల్వతో పాటు సుంకేసుల బ్యారేజ్ నుంచి సుమారు లక్ష ఎకరాల వరకు సాగవుతుంది. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టుల కింద కాల్వలకు మరమ్మతులు, జంగిల్ కటింగ్, తూముల నిర్వహణ, ఇతర మైనర్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈసారి అవేవీ జరుగడం లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల కింద 8లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయి. ఈ జిల్లాలో కృష్ణా, తుంగభద్రా నదులు ప్రవహిస్తాయి. ఈ రెండు నదుల కింద వివిధ ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు నదులపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
దీంతోపాటు ప్రతి ఏటా ఈ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం ముందుగానే బడ్జెట్లో నిధులు కేటాయింది. ఈసారి అధికారం మారడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కాగా.. ప్రాజెక్టుల రూపురేఖలు మారుతాయని అన్నదాతలు ఆశించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఏడాదికోసారి నిర్వహించాల్సిన మరమ్మతులే నిలిచిపోవడం గమనార్హం. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే మరమ్మతులు నిలిచిపోయాయయని అధికారులు చెబుతున్నారు.