మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 5 : గుప్తు నిధులు ఉన్నాయని కొందరు నిందితులు గుట్టలోకి తీసుకెళ్లిన పూజారిని దారుణంగా కొట్టి హత్యచేసిన ఘటన అదివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శివారులోని వెలుగులోకి వచ్చింది. తన భర్త రెండ్రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన మహిళ 2వ మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ సోమ్‌నారాయణ్ సింగ్ మహబూబ్‌నగర్‌లోని బోయపల్లికి చెందిన సాయిలు (40) కనిపించటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పూజారి భార్య చెప్పిన అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా జడ్చర్లలోని దేవుని గుట్టపైన గుప్తనిధులు ఉన్నాయని సాయిలు సూచన మేరకు కొందరు అతడిని మూడ్రోజుల కిందట ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే గుప్త నిధుల కోసం వెళ్లగా అక్కడ లేకపోవడంతో తీసుకెళ్లిన వ్యక్తులు పూజారిని కొట్టి చంపినట్లు వెల్లడైంది.
డబ్బులు తీసుకొని గుప్త నిధులు చూయించలేదన్న కోపంతో కట్టెలతో కొట్టడంతో కొండపై నుంచి పడి చనిపోయాడు. వెంటనే సీఐ సోమ్‌నారాయణ్ సింగ్ తన సిబ్బందితో కలిసి జడ్చర్ల దేవుడిగుట్టపైకి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. మూడ్రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నూరుల్లా, సొహెబ్, రవినాయక్, కోయిలకొండకు చెందిన శ్రీనివాసులు, దేవరకద్ర మండలం కోటకండకు చెందిన జహంగీర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.