హనుమకొండ, జూన్ 5 : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్ ఖరారైన కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో 2022లో చివరిసారి భూముల మార్కెట్ విలువ పెంచారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత భూముల ధరలు పెంచారు. సవరించిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ పరిధి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు డబుల్ అయ్యాయి.
కొత్తపల్లి హావేలి, వడ్డేపల్లి ప్రాంతాల్లో వంద శాతం పెంచగా, మిగిలిన ప్రాంతాల్లో 50శాతం నుంచి 90 శాతం వరకు ధరలు సవరించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా ధరలు పెంచారు. కాగా, ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో భూముల ధరలు పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త రేట్లు అమలులోకి రాగా, ఇప్పటికే స్లాట్స్ బుక్ చేసుకున్న వారు మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ పుంజుకున్నదని, గత అసెంబ్లీ ఎన్నికల ముందు రియల్ రంగం క్షీణించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కుదేలైందని పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం వంద గజాల ప్లాట్ కూడా అమ్మలేని దుర్భర స్థితిలో ఉన్నామని, అంతంత మాత్రంగా సాగుతున్న రియల్ వ్యాపారం ప్రభుత్వం నిర్ణయంతో మరింత క్షీణించే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందకొచ్చే అవకాశం ఉండదని, తద్వారా క్రయ విక్రయాలు తగ్గుతాయని పలువురు రియల్టర్లు వాపోతున్నారు.
జనగామ, జూన్5 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లావ్యాప్తంగా ఆస్తుల విలువ భారీగా పెరగడంతో సర్కార్‌కు ఆదాయం పెరుగుతున్నా.. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేషన్ చార్జీల పేరిట ఆర్థిక భారం పడుతున్నది. జిల్లాలో వ్యవసాయ భూములకు కనిష్ఠ మార్కెట్ విలువ గతంలో ఎకరానికి రూ.2.25 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.2.75లక్షలకు పెరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ప్లాట్ల విలువ సగటున 82శాతం పెరిగాయి. అపార్ట్మెంట్ల మార్కెట్ విలువ సైతం భారీగా పెరిగింది. మొన్నటి వరకు గ్రామాల్లో మార్కెట్ విలువ ప్రకారం గజం ధర రూ.500 ఉంటే ప్రస్తుతం ఏకంగా రూ.900కు, రూ.700 నుంచి రూ.1,300కు, రూ.1,300 నుంచి రూ.2,100కు పెరిగింది.
జనగామ మున్సిపల్ పరిధిలోని 57 బ్లాకుల్లో భూములు, ప్లాట్ల మార్కెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. 1వ జోన్‌లోని 13 బ్లాకుల్లో పాత వాల్యూయేషన్ రూ.2,100-రూ.9,500 నుంచి కొత్త వాల్యూయేషన్ ప్రకారం రూ.3,200-రూ.14,300కు, 2వ జోన్‌లోని 11 బ్లాకుల్లో రూ.2,100-24,700 నుంచి రూ.3,200-రూ.43,300కు, 3వ జోన్‌లోని 11 బ్లాకుల్లో రూ.2,100-21,300 నుంచి రూ.3,200-37,300కు, 4వ జోన్‌లోని 13 బ్లాకుల్లో రూ.2,100-రూ.14,200 నుంచి రూ.3,200-24,900కు, 5వ జోన్‌లోని 6 బ్లాకుల్లో రూ.2,100-4,100 నుంచి రూ.3,200-6,200కు, 6వ జోన్‌లోని 3 బ్లాకుల్లో రూ.2,100-రూ.24,700 నుంచి రూ.3,200-రూ.43,300కు పెరిగింది. ఆరీస్టీ బస్టాండ్ ప్రాంతంలో ప్లాట్ల విలువ 79.2శాతం, నెహ్రూపార్కు-గాంధీచౌక్ వరకు 75.1శాతం, పోలీస్‌స్టేషన్ ఏరియాలో 75శాతం, హనుమకొండ రోడ్డులో 75శాతం, ఆర్టీసీ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డు కలెక్టరేట్ మార్గంలో 75.3శాతం, పోలీస్‌స్టేషన్ రోడ్డులో 75.2శాతం, దయానిలయం ఏరియాలో 50.5శాతం, శ్రీరాంనగర్ రోడ్డులో 50శాతం పెరిగింది.
ఇక స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలో శివునిపల్లిలో రూ.2,100 నుంచి రూ.3,200, ఛాగల్లులో రూ.1,100 నుంచి రూ.2,200కు పెరిగింది. చిల్పూరు మండలంలో జాతీయ రహదారి పక్కన భూములపై 10శాతం, నర్మెట మండలంలో వ్యవసాయ భూములకు 30శాతం, లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో రూ.6.75లక్షలున్న భూమి విలువ ఇప్పుడు రూ.9.45లక్షలకు పెరిగింది. పాలకుర్తిలో రూ.1,300 నుంచి రూ.2,300, రూ.5,800 ఉన్న విలువ రూ.10,200కు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో వ్యవసాయ భూములకు రూ.2.25లక్షల నుంచి రూ.2.85లక్షలు, రూ.6లక్షల నుంచి రూ.8లక్షలకు, కొడకండ్లలో 50 నుంచి 75శాతం భూముల విలువ పెరిగింది.
హనుమకొండ జిల్లాలోని కొత్తపల్లి హవేలి, వడ్డెపల్లి (కోమటిపల్లి రోడ్డు)రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూముల ధరలను వంద శాతం పెంచారు. ఉదాహరణకు గతంలో ఈ ప్రాంతంలో చదరపు గజానికి రూ. 3100 ఉంటే ప్రస్తుతం రూ. 6200లకు పెంచారు. అదే విధంగా భీమారం, చింతగటు,్ట హసన్‌పర్తి, దేవన్నపేట, కాజీపేట, సోమిడి, హనుమకొండలోని కొన్ని ప్రాంతాల్లో 50 శాతం, ఎల్లాపూర్, కుమార్‌పల్లి ఏరియాల్లో 52 శాతం, లష్కర్ సింగారం, కుమార్‌పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో, వడ్డేపల్లి, గోపాల్‌పుర్ ఏరియాల్లో 76 శాతం, గ్రామీణ ప్రాంతాలైన ఐనవోలు మండలం కక్కిరాలపల్లి, కొండపర్తి, నందనం, మడిపల్లి, పెగడపల్లి, సిద్దాపుర్ ప్రాంతాల్లో 75 నుంచి 90 శాతం వరకు ధరలను పెంచినట్లు అధికారులు తెలిపారు.
కాజీపేట ప్రాంతంలో చదరపు గజానికి రూ.4100 ఉండగా రూ. 7వేలకు, చింతగట్టు ప్రాంతంలో రూ. 2100 నుంచి రూ.3200, కడిపికొండ ప్రాంతంలో రూ. 2700 నుంచి 4100కు, శాయంపేట ఏరియాలో రూ. 11,500 నుంచి 17,300కు, సోమిడి ఏరియాలో రూ. 3100 నుంచి రూ.4700కు, వెంకటాపుర్ ఏరియాలో రూ.700 నుంచి 1600కు, వడ్డేపల్లి ఏరియాలో రూ.3100 నుంచి రూ.4700కు, రాంపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రూ. 2100 నుంచి 3200కు, మరికొన్ని ప్రాంతాల్లో రూ.3200 నుంచి రూ4వేలకు, దేవన్నపేట ఏరియాలో రూ.1700 నుంచి రూ.2600కు, మడికొండ ప్రాంతంలో రూ. 2100 నుంచి రూ.3,100కు, భట్టుపల్లి ఏరియాల్లో రూ. 900 నుంచి రూ.1600కు, అలాగే మడికొండ సర్వే నంబర్ 1099 ఏరియాల్లో రూ. 4200 నుంచి రూ.6200కు భూముల ధరలను సవరించారు.