కొల్లాపూర్, ఫిబ్రవరి 22 : ఎంజీకేఎల్ఐలో భాగంగా కొల్లాపూర్ మండలంలో నిర్మించిన సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్లో ప్రస్తుతం 0.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయ ర్ కింద గత తొమ్మిదేండ్లల్లో యాసంగిలో మూడొందల ఎకరాలలోపే రైతులు వరి సాగు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది వానకాలంలోనూ నిర్దేశించిన ఆయకట్టు మొత్తం ఐదు వేల ఎకరాల్లో 8 గ్రామాల రైతులు వరి పంట సాగుతో లబ్ధిపొందుతూ వచ్చారు. గత తొమ్మిదేండ్లుగా రెండు పంటలను సాగు చేసి ధాన్యపు రాశులను రైతులు పండించారు. ఈ రిజర్వాయర్ కింద ప్రస్తుతం యాసంగిలో ఐదువేల ఎకరాల నుంచి మూడొందల ఎకరాలకు వరి సాగు పడిపోయింది.
ఈ మూడొందల ఎకరాలు సాగు చేసింది ఒక సింగవట్నం గ్రామ రైతులే. మిగతా ఏడు గ్రామాల రైతులు రిజర్వాయర్లో నీటి లభ్యతకు కష్టతరం కానున్నదని భావించి పంటకు నీరందక ఎండిపోతే సాగు పెట్టుబడులంతా వృథా అవుతుందన్న భయంతో ఈ యాసంగిలో వరి సాగు చేయకుండా క్రాఫ్ హాలీడేను రైతులే ప్రకటించుకున్నారు. దీంతో జావాయిపల్లి, మాచినేనిపల్లి, ఎన్మన్బెట్ల, చౌటబట్ల, నర్సింహాపురం, నర్సింగరావుపల్లి, రామాపురం గ్రామాల శివారు మాగాణి పొలాలన్నీ బీళ్లుగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వంలో పాలకుల ముందుచూపు కారణంగా ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులోని రిజర్వాయర్లలో కృష్ణానది నీటిని సమయానుకూలంగా నింపగలిగారు. దీంతో రైతుకు ఎలాంటి అవాంతరాలు ఉత్పన్నం కాలేదు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక తమకు సాగు నీటి కష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.