జననేత రాక కోసం జగమంతా ఎదురుచూస్తున్నది. ఆదివారం జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గులాబీ బాస్ పర్యటించనున్నారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో మీటింగ్‌లను గ్రాండ్ సక్సెస్ చేసే పనిలో గులాబీ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. సభల ఏర్పాట్లను ఆయా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున సమీకరణ చేపట్టి అట్టహాసంగా నిర్వహించేందుకు నేతలు స్కెచ్ వేశారు. ఇప్పటికే సభా ప్రాంగణాలు గులాబీమయంగా మారాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, రహదారులను జెండాలు ముంచెత్తాయి. భారీ సంఖ్యలో తరలివచ్చే జనం కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధినేత ఆగమనంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ నెలకొనగా.. విపక్షాలకు మాత్రం వణుకుపుడుతున్నది.
మహబూబ్‌నగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత, ప్రగతి ప్రధాత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్రజా ఆశీర్వద సభల్లో నేడు పాల్గొంటున్నారు. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్నికల జైత్రయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయా నియెజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు, నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తుది అంకం షురూ కావడంతో కేసీఆర్ ప్రజాఆశీర్వద సభలను ఛాలెంజ్‌గా తీసుకుని పార్టీశ్రేణులు ఏర్పాట్లతో తలమునకలయ్యారు. మధ్నాహ్నం ఒంటిగంటకు అలంపూర్‌లో ప్రజాఆశీర్వద సభ పారంభంకానున్నది. మధ్యాహ్నం 2గంటలకు కొల్లాపూర్‌లో, సాయంత్రం 3గంటలకు నాగర్‌కర్నూల్, 4గంటలకు కల్వకుర్తిల్లో జరిగే ప్రజాఆశీర్వద సభల్లో పాల్గొంటారు. పార్టీ అధినేత రాకతో ఆయా నియెజకవర్గ కేంద్రాలు గులాబీ మయంగా మారాయి. సభా వేదిక చుట్టూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రహదారులన్నీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. గ్రామాల నుంచి పెద్దఎత్తున జనం కదలివస్తుండడంతో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సభా ప్రాంగణం చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ చేసుకునేలా చదును చేశారు. జనాలు వచ్చి పోవడానికి ఇబ్బందులు లేకుండా పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 6వతేదీన కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఏకంగా నాలుగు సభల్లో పాల్గొనగా, ఆలస్యంగా వచ్చినా జనం కదలకుండా కుర్చోవడం, కనీవినీ ఎరుగని రీతిలో సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. తాజాగా మరోసారి నాలుగు సభల్లో కేసీఆర్ పాల్గొంటుడడంతో విపక్షాల్లో వణుకుపుడుతున్నది. ఇప్పటికే ఆయా పార్టీల అధినాయకులు ఒకటి, రెండు నియెజకవర్గాల్లో మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. మిగితా నియోజకవర్గాల్లో వస్తారో, రారోననే బెంగ విపక్షాల అభ్యర్థుల్లో ఉంది. కానీ బీఆర్ఎస్ అధినేత అన్ని నియెజకవర్గాల్లో సభల్లో పాల్గొంటుండడంతో ప్రతిపక్షాలు అయోమయానికి గురవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఇక 11రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచార అస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాకతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో టికెట్లు ఆశించిన హేమాహేమిలంతా కారెక్కేశారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీలకు ఆయా నియెజకవర్గాల్లో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. మరికొన్ని చోట్ల చాలామంది నేతలు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. కాగా, కారు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. మరోవైపు కీలక నియెజకవర్గాల్లో సైతం పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటుండడంతో ఆయా నియెజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
కొడంగల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియెజకవర్గాలను బీఆర్ఎస్ ఛాలెంజ్‌గా తీసుకుని 2018 సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. అలంపూర్‌లో పార్టీ అభ్యర్థిని మార్చి గెలుపు బాధ్యతలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డిపై ఉంచారు. దీంతో అన్నీ తానై అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరుండి అభర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వడ్డ్డేపల్లి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించగా, అంతకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా జనసమీకరణ చేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కొల్లాపూర్‌లో కూడా ఇటీవల రాహుల్‌గాంధీ సభ నిర్వహించగా, అంతకుమించి కేసీఆర్ సభను నిర్వహించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలల కిందటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కృష్ణా జలాలను ఉబికి వ చ్చేలా చేయడంతో ఈప్రాంత రైతులు ఆనందం లో మునిగిపోయారు. తిరిగి ఈ సారి ప్రజాఆశీర్వద సభకు వస్తుండడంతో పెద్దఎత్తున నిర్వహించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ అధినేత కేసీఆర్ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండడంతో ఆయా నియెజకవర్గ అభ్యర్థులు, పార్టీ నేతలు నాలుగు రోజుల నుంచి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అలంపూర్‌లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తిలో జైపాల్‌యాదవ్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు తీరకలేకుండా ప్రచారం చేస్తునే మరోవైపు మండల, గ్రామస్థాయి నాయకులతో మాట్లాడుతూ.. సభను విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున జనాలను సమీకరించాలని, అందుకు తగిన వాహనాలను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ప్రజాఆశీర్వద సభలు నిర్వహించే సమీప గ్రామాల నుంచి బైక్ ర్యాలీలు, డప్పులు, డోళ్లతో ప్రదర్శనలు, బొడ్డెమ్మలు వేస్తూ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. సభకు వచ్చే వారికోసం వాహనాల పార్కింగ్, తాగునీళ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో నాలుగు నియెజకవర్గాల్లో పోటీపోటీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ సభలను ధూంధాంగా నిర్వహిస్తుండడంతో విపక్షాల్లో గుబులు రేకెత్తుతున్నది.