ఎర్రవల్లి చౌరస్తా, నవంబర్ 19 : జింకలపల్లి జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎస్ లిమిటెడ్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. అలంపూర్ ని యోజకవర్గంలోని షేక్‌పల్లి, ఎర్రవల్లి, కొండే రు, జింకలపల్లి, కోదండాపూర్తోపాటు సమీ ప గ్రామాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. ప్రజల ప్రాణాలను హరించేలా.. సాగు భూములను జీవచ్ఛవంలా మార్చేలా ఎస్ఎన్ఎస్ కంపెనీ విషపూరిత రసాయనాలను వ్యాప్తి చేస్తున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షేక్‌పల్లి పెద్దవాగుతోపాటు కృష్ణానదిలోకి విషరసాయనాలను వదులుతున్నారు. షేక్‌పల్లి పెద్దవాగు విషపూరితమై వాగు నీళ్లు తాగిన మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. కంపెనీ నుంచి వచ్చే దుర్గంధంతో శ్వాసకోస సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా వివిధ గ్రామాల ప్రజలు కంపెనీ నుంచి కలిగే నష్టా న్ని అధికారులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కంపెనీ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి 50ఎకరాల వరకు భూమిని లీజుకు తీసుకొని అందులో కంపెనీ నుంచి వెలువడే విషపూరిత రసాయనాలను వదులుతున్నారు. దీంతో చుట్టుపక్కల పొలాలు సాగుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ఎలాంటి ప్రయోజనం లేదని, శాశ్వత పరిష్కారం చూపే వరకు ఆందోళనలు చేపడుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
సమస్యలను తెలుసుకుంటాం..
కంపెనీ సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. గతంలో సమస్యలు వస్తే తగిన చర్యలు చేపట్టాం. కంపెనీ నుంచి ఎలాంటి విషరసాయనాలు వదలడం లేదు. 70ఎకరాల భూమిని రైతుల నుంచి లీజుకు తీసుకొని అందులో కంపెనీ నుంచి వచ్చే వేస్ట్‌వాటర్‌ను వదులుతున్నాం. రానున్న 6నెలల్లోగా అధికారులతో చర్చించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రావు, జీఎం, ఎస్ఎన్ఎస్ కంపెనీ
ఫిర్యాదులేమీ రాలేదు..
ఎస్ఎన్ఎస్ కంపెనీ నుంచి సమస్యలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. షేక్‌పల్లి నుంచి రైతు ఫోన్ చేసి కంపెనీ సమస్యల గురించి సమాచారం ఇచ్చాడు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం.
– సాయిదివ్య, ఏఈ, పొల్యూషన్ బోర్డు
ప్రజల ప్రాణాలతో చెలగాటం..
జింకలపల్లి జాతీయ రహదారిపై ఏర్పాటైన ఎస్ఎన్ఎస్ కంపెనీ ఐదు గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపించి మధ్యవర్తుల ద్వారా భూములు లాక్కొని ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోగా, మా జీవితాల్లో విషం చిమ్ముతున్నది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలతో నీళ్లు కలుషితమై అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. షేక్‌పల్లి పెద్దవాగు నుంచి కృష్ణానదిలోకి రసాయనాలు వెళ్తున్నాయి. ప్రభుత్వం స్పందించి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
– భీమేశ్వర్రెడ్డి, షేక్‌పల్లి
భూములు పడావు పడ్డాయి..
కంపెనీ నుంచి భరించలేని దుర్గంధం వస్తున్నది. దట్టమైన పొగతో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలు ప్రాణాలకే ప్రమాదకరంగా మారాయి. తాగునీటికి, మూగ జీవాలకు ఆధారమైన వాగు కంపెనీ వల్ల విషపూరితంగా మారింది. కంపెనీ వ్యర్థాలు భూమిలోకి వెళ్లి పంటలు విషతుల్యమవుతున్నాయి. ధరలు లేక పడావు పడ్డాయి. ఇక్కడ పండించే కూరగాయలు, ఆకుకూరలు అమ్మితే ఎవరూ కొనడం లేదు. చుట్టుపక్కల భూములు బంగారంలా ధర పలుకుతుండగా, మా భూములకు విలువలేకుండా పోయింది. అధికారులు, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
– కాంతారెడ్డి, రైతు, షేక్‌పల్లి
రైతన్న నిరీక్షణ
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అమ్మకానికి రైతన్నలకు గోస తప్పడం లేదు.. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఓబులాయపల్లి వద్ద సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ఎదుట కిలోమీటర్ల మేర తెల్లబంగారం లోడ్లతో ట్రాక్టర్లు, డీసీఎంలు బారులుదీరాయి. కేంద్రంలో సర్వర్ ప్రాబ్లం తలెత్తడంతో రోడ్డు పక్కన కాటన్ లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్లు వరుసగా నిలబడ్డాయి. ఒకవైపు మద్దతు ధర లేక.. మరోవైపు అమ్మడానికి కొనుగోలు కేంద్రాలు లేక పండించిన రైతన్నకు అవస్థలు తప్పడం లేదనడానికి ఈ క్యూ నిదర్శనంగా నిలుస్తోంది. కూలీలను పెట్టి పత్తిని ఏరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. లోడ్ల వద్ద జాగరణ చేయాల్సిన పరిస్థితి అంటూ ఆవేదన చెందుతున్నారు. మా గోస అధికారులకు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చొరవ చూపి పత్తి కొనుగోలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంగళవారం కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు వాహనాల కిందే సేద తీరారు.