ఊట్కూర్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి భేదభావం లేకుండా పారదర్శకంగా ( Transparently ) , మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ( SP Vineeth) పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ స్టేషన్‌ను సందర్శించారు.
పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రౌడీ, సస్పెక్ట్, కమ్యూనల్ షీటర్లపై నిరంతర నిఘా ఉంచి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, అక్రమ వ్యాపారాల అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్ఐ రమేష్, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.