కోస్గి, ఏప్రిల్ 3 : మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీమంత్రి కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలోని బావోజీ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఓ దారిలో బయటకు రాగా మళ్లీ లోపలికి వెళ్లే క్రమంలో కోస్గి సీఐ సైదులు వారిని లోపలికి రానివ్వ కుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితి వివరిస్తున్నా పోలీసులు వారి మాటవినే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కనీసం ఎందుకు వెళ్తున్నారో కూడా వినిపించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేయగా కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అక్కడే ఉన్న బీ ఆర్ఎస్ నాయకులు శ్రేణులు గుమిగూడగా మాజీ ఎమ్మెల్యే పట్నం వారికి నచ్చ చె ప్పడంతో వారు కాస్తా వెనక్కి తగ్గారు.
తర్వాత మాజీ మంత్రి వేరే దారి గుండా బయటికి వెళ్లిపోయారు. అనంతరం కోస్గి మండల నాయకులు వెంకటనర్సింహులు మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బావోజీ జాతరకు రాగా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, ఇది సరిన పద్ధతి కాదని హితవు పలికారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు, అధికారులు గమనించాలని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష నేత ఆలయానికి వస్తే దానిని కూడా పోలీసులు రా జకీయం చేస్తారా అని ప్రశ్నించారు.