మూసాపేట, అక్టోబర్ 25 : హైటెక్ హంగులతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని డ్రైవర్లు, ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వెరసి 2013 అక్టోబర్ 30న వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూర్-హైదరాబాద్ హైవేపై కల్వర్టును వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో 45 మంది సజీవ దహనమయ్యారు.. రోజుల తరబడి మృతదేహాలను హైదరాబాద్‌లోని దవాఖానలోనే ఉంచి డీఎన్ఏ పరీక్షలు చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎవరిది ఏ మృతదేహమో అని పోల్చుకోలేని స్థితిలో కుటుంబ సభ్యులు మృతదేహాలకు అంత్యక్రియలు చేసుకున్నారు
. అప్పట్లో ఈ ఘటన దే శం మొత్తం సంచలనం రేపింది. ప్రమాదానికి కారణమైన బ స్సు డ్రైవర్ తప్పా ఏ ఒక్కరూ బతకలేదు. ఇదే ఘటనను తలపిస్తూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బైక్‌ను ఢీ కొట్టిన ప్రమాదంలో మంటలు చెలరేగి 19 మంది మాంసపు ముద్దలుగా గుర్తు పట్టలేనంతగా మారిపోగా, మరికొందరు గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ మాత్రం ఇక్కడా, అక్కడా బతికి బయటపడ్డారు. రెండు ప్రమాదాల్లోనూ డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అధికారులు, ప్రభుత్వాలు ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేసి తర్వాత వదిలేయడంతోనే తరుచూ ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్రానికి చెందిన నిపుణులు ఎంతో మంది అధికారులు వచ్చి పాలెం ఘటన శిథిలాలను పరీక్షించారు. ఈ కేసు సీఐడీకి అప్పగించారు. కొంత కాలానికి డ్రైవర్‌తోపాటు, బస్సు యజమాని జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ ప్రమాదం ఘటనపై కఠిన చర్యలు, జాగ్రతలు తీసుకోకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నామమాత్రపు చర్యలతోనే ట్రావెల్స్ యజమాన్యాలు జాగ్రత్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రతి రోజూ రాత్రి సమయంలో అధికంగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తుంటాయి. తెల్లవారుమున నుంచి కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తుంటాయి. ఆ సమయంలో ప్రయాణం చేయాలంటేనే వాహనాదారులు హడలెత్తుతారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతోపాటు వేగంగా వచ్చి మరి దగ్గరగా తీసుకొచ్చి కట్ కొట్టి వెళ్తుంటారు. ఆ సమయంలో పక్కన ఉన్న వాహనాలు, మోటర్ సైకిళ్లు, కార్లు కూ డా కదులుతుంటాయి. ఆ సమయంలో బిక్కుబిక్కు మంటూ బండ్లు నడపాల్సి వస్తుందని వాహన చోదకులు వాపోతున్నారు. అయితే ఓల్వో బస్సుల యజమాన్యం మాత్రం ప్రయాణికులు భద్రతకంటే లాభాలపైనే ఎక్కవ శ్రద్ధ చూపుతుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరగడంతోపాటు, ప్రయాణికులు సజీవ దహనం అవుతారని చెప్పడానికి నాడు పాలెం, నేడు కర్నూల్ ప్రమాదాలే నిదర్శనం.
పాలెం వోల్వో బస్సు ప్రమాదం 2013 అక్టోబర్ 30న జరిగింది. ఇంకా 5 రోజులు గడిస్తే 12 యేండ్లు పూర్తవుతాయి. సజీవ దహనమైన 45మంది ఆత్మలు పన్నెండేళ్లుగా తమ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షంచాలని వారి ఆత్మలు న్యాయం కోసం ఘోషిస్తూనే ఉన్నాయి. మాకు జరిగిన ప్రమాదం మరొకరికి జరగకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు నాడు ఉద్యమాలు సైతం చేశారు. కానీ ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అప్పటికప్పుడు హడావుడి చేసి తర్వాత చేతులు దులుపుకొన్నారు. చిన్నపాటి మంటలు వచ్చినా నివారించే చర్యలు లేవు. అధికారులు, ప్రభుత్వాలు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు ప్రయాణికుల సేప్టీకి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.