గద్వాల అర్బన్, జూన్ 25 : ఈ నెల 17వ తేదీన జరిగిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడంతో సంచన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ హత్యకు ప్రధాన కారుకులైన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాత, బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతోపాటు మరి కొంతమంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
ముందుగా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించగా.. విచారణలో కొందరి పేర్లు వారు చెప్పడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే అదుపులోకి తీసుకున్న నిందితులను పూర్తిగా విచారిస్తు ఈ హత్య ఎలా చేశారు ? హత్య ఎవరు చేయించారు అన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే ఈ హత్యకు సూఫారీ ఇచ్చింది.. బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు అని సుఫారీ గ్యాంగ్ వెల్లడించడంతో ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే తేజేశ్వర్ హత్య విషయంలో తన ప్రమేయం లే కుండా ఉండేందుకు తన తరఫున న్యాయవాదులను గద్వాల పోలీసుల దగ్గరకు పంపించినట్లు తెలిసింది.
పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో విషయం తెలుసుకున్న తిరుమలరావు కేసు నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసుకొని విదేశాలకు పారిపోయేందుకు కూడా సిద్ధమవ్వడంతో పోలీసులు సాంకేతిర పరిజ్ఞానం ఉపయోగించి తిరుమలరావు హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తిరుమలరావు ఎయిర్‌పోర్టుకు వెళ్లి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడా.. అన్న కోణంలో పోలీసు అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులకు ఆయనకు సంబంధించిన వివరాలను వారి దృష్టికి తీసుకువచ్చి పాస్‌పోర్ట్‌ను లుకెట్ చేసినట్లు సమాచారం.
దీనిని గుర్తించిన తిరుమలరావు హైదరాబాద్ సిటీలోకి పారిపోయాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మూడు ఫోన్లు కూడా మార్చినట్లు తెలిసింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో రెక్కీ నిర్వహించి బుధవారం తెల్లవారు జామున తిరుమలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గద్వాలకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది.
పోలీస్ అధికారులు తిరుమలరావు తేజేశ్వర్‌ను ఒక్కడినే హత్య చేశారా ? గతంలో ఇంకా ఎవరినైనా హత్య చేశారా? చేయించారా అని.. గతంలో ఐశ్వర్య తమ్ముడు మరణంపై కూడా విచారించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అందరినీ మరోసారి విచారించినట్లు సమాచారం. ఈ కేసులో తేజేశ్వర్ కుటుంబ సభ్యులను కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు తెలిసింది.
కాగా తిరుమలరావు తండ్రి కర్నూలు జిల్లాలో రిటైర్ట్ ఏఎస్సైగా వ్యవహరించినట్లు సమాచారం. ఆయనపై కూడా రౌడీషీట్ ఉన్నట్లు సమాచారం. అయితే తిరుమలరావును ఈ కేసు నుంచి తప్పించుకునేందకు పోలీస్‌శాఖలో ఓ వ్యక్తి సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి సూచనల నేపథ్యంలోనే తిరుమలరావు పోలీసుల కంట పడకుండా తప్పించుకొని తిరిగినట్లు సమాచారం. అయితే తిరుమలరావుకు సహకరించిన వ్యక్తి ఎవరనేదీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలో తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించిన విషయాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నది.