కల్వకుర్తి, ఏప్రిల్ 7 : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో సంచలనం సృష్టించిన రుద్రాక్షల మహేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి హత్య కేసు వివరాలను వెల్లడించారు. భూమి, ఆస్తి, పందుల పెంపకం వంటి అంశాలు మహేశ్ హత్యకు కారణమని డీఎస్పీ చెప్పారు. ఈ నెల 3వ తేదీ రాత్రి వెల్దండ మండలం పోతేపల్లి దారిలో టిప్పర్. కారు ఢీ కొన్న ఘటనలో రుదాక్షల మహేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మొదట ఈ ఘటన రోడ్డు ప్రమాదంగా కనిపించినా.. వాస్తవానికి పథకం ప్రకారం చేసిన హత్యగా తమ దర్యాప్తులో గుర్తించామని చెప్పారు.
రుద్రాక్షల సాయిలు అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య జంగమ్మకు రుద్రాక్షలు కృష్ణయ్య, మనుపాటి పెద్ద వెంకటమ్మ, చిన్న వెంకటయ్య సంతానం, మరో భార్య అంజనమ్మకు శివశంకర్, రుద్రాక్షల మహేశ్‌లు సంతానంగా ఉన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి సంబంధించిన తగాదాలు ఉన్నాయి. పాత కక్షలను మనుసులో ఉంచుకున్న మనుపాటి అవినాశ్, మనుపాటి శివ, మనుపాటి పవన్, మనుపాటి వెంకటమ్మ, రుద్రాక్షల కృష్ణయ్యలు మహేశ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి పథకం వేసిన నిందితులు ఐదుగురు టిప్పర్ డ్రైవర్ బురాన్ సహాయాన్ని తీసుకున్నారు.
రూ.2లక్షలు ఇస్తామని చెప్పి అడ్వాన్స్‌గా రూ.1.50లక్షలు ఇచ్చారు. పథకం ప్రకారం ఈనెల 3రాత్రి మహేశ్ కారులో పోతేపల్లి వైపు వెళ్తుండగా ట్రిప్పర్తో కారును ఢీకొట్టి ప్రమాదంలా సృష్టించారు. అయితే మహేశ్ బతికి ఉండడంతో నిందితులు మహేశ్‌ను రాళ్లతో కొట్టి చంపారని తమ దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించి.. దర్యాప్తును వేగవంతం చేశామని ఆయన తెలిపారు. అందులో భాగంగా నిఘా పెంచి కల్వకుర్తి మండలం తిమ్మరాశిపల్లి గ్రామ శివారులో ఒక పందుల దొడ్లో తలదాచుకుంటున్న నిందితులను గుర్తించి ఈనెల 7(మంగళవారం) ఉదయం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. వారి నుంచి కారు, టిప్పర్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసును ఛేదించిన సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సై కురుమూర్తి ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.