గద్వాల అర్బన్, డిసెంబర్ 2 : సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బైకులను చోరీ చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన రేణుక గత నెల 13న రాత్రి తన ఇంటి ఎదుట నిలిపి ఉన్న స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించగా.. గత నెల 28న పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కాగా సోమవారం ఉదయం గద్వాల టౌన్ పోలీసులు సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ప్రభుత్వ దవాఖాన ఎదురుగా వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన వ్యక్తి అనుమానంగా కనిపించాడు.
బైక్‌ను ఆపి వాహన పత్రాలు చూపించాలని పోలీసులు కోరగా.. తాను బైక్‌ను ఎత్తుకొచ్చినట్లు ఒప్పుకొన్నాడు. తర్వాత విచారణ చేపట్టగా మొత్తం 8 మంది చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రాత్రి సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఎవరూ లేని సమయంలో ఇండ్ల ముందు నిలిపి ఉంచే బైక్‌లను చోరీ చేసేవారమని, తర్వాత వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారమని ఒప్పుకొన్నాడు.
దీంతో గద్వాలకు చెందిన గాంధీ చిన్న, నాగరాజు, రఫీ, మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన నవీన్, కొత్తకోటకు చెందిన వహీద్, ఆదర్శ్‌ను అరెస్టు చేయగా.. గద్వాలకు చెందిన వంశీ, మదనాపురానికి చెందిన రాధాకృష్ణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి మొత్తం వివిధ రకాల 35 బైక్‌లు, స్కూటీలు (రూ.30 లక్షలు) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన టౌన్ ఎస్సై కళ్యాణ్ రావు, సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయిల్‌కు క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ గుణశేఖర్, సీఐ శ్రీనివాస్, ఎస్బీ సీఐ నాగేశ్వర్‌రెడ్డి, రవిబాబు, ఎస్సైలు కళ్యాణ్‌రావు, అబ్దుల్ షుకూర్, పోలీసులు పాల్గొన్నారు.