మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 : పాలమూరులో భూ కబ్జాలు ఉండవు, బెదిరింపులు ఉండవని చెప్పి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో పాలమూరు ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన మాటలు గాలికే పరిమతమయ్యాయి. చలువగాలి రాఘవేందర్‌రాజు ఓ మహిళను అతని ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి అక్రమంగా మూడు ఎకరాల భూమిని పట్టాచేసుకున్నాడు. దీనిపై బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాఘవేందర్‌రాజు, అతని డ్రైవర్ శివశంకర్‌గౌడ్, గోక నరేందర్‌లతో పాటు జడ్చర్లకు చెందిన సామశివలింగం, సురేశ్‌తోపాటు మరో 30 మందిపైకేసు నమోదు చేసినట్లు మహబూబ్‌నగర్ రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ సోమవారం తెలిపారు.
బాధితురాలు పాలాది కళావతి తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు నెలల కిందట పాల్కొండ శివారులోని మూడు ఎకరాల విలువైన భూముల్ని కాజేసేందుకు చలువగాలి రాఘవేందర్రాజుతోపాటు 30 మంది రౌడీలు మాపై రకరకాల కుట్రలు చేసినా మేము భయపడలేదు. అక్కడితో ఆగకుండా మాపై ఏకంగా ఆరు అక్రమ కేసులు నమోదు చేయగా మేము హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకున్నామని చెప్పారు. అయితే బెయిల్ షరుతుల ప్రకారం నేను నా కుమారులం రెండు నెలల కిందట (ఆగస్టు 4న) మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుస్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుంటే మయూరి ఏకో పార్కు దగ్గర ప్రధాన రహదారిపై తన రౌడీలతో కాపు కాసిన రాఘవేందర్ రాజు మేము వెళ్తున్న కారును అడ్డగించి నన్ను నా కుమారులను రోడ్డుపైనే భయపెట్టి నన్ను, నా కుమారులను వారి వేర్వేరు వాహనాల్లో కిడ్నప్ చేసి తీసుకెళ్లారు.
నన్ను మాత్రం తాటికొండ గ్రామ శివారులోని రాఘవేందర్ రాజు ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లారు. నా కుమారులను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. నేను మహిళనని, సీనియర్ సిటిజన్ అని చూడకుండా నన్ను నా కుమారులను చిత్రహింసలు పెట్టి బెదిరించి రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే నీ కుమారులను నా రౌడీలు చంపేస్తారని తీవ్రస్థాయిలో భయపెట్టాడు. నా కుమారుల మెడపై కత్తిపెట్టి నాకు వీడియో కాల్ ద్వారా చూపించి భయపెట్టాడు. నన్ను అక్కడి నుంచి మహబూబ్‌నగర్ అర్బన్ తాసీల్దార్ కార్యాలయానికి రాఘవేందర్ రాజు వాహనంలో తీసుకెళ్లి రాఘవేందర్ రాజు పేరున 3.05 ఎకకారాలు, మరో వ్యక్తి గోక నరేందర్ పేరున 0.27 గుంటల భూమిని భయపెట్టి ఒక్క పైసా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అక్కడి నుంచి మళ్లీ నన్ను రాఘవేందర్ రాజు తన ఫాంహౌస్‌కు తీసుకెళ్లి నన్ను నా కుమారులను రాత్రి 8 గంటల వరకు చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పినా, ఎవరికైనా ఫిర్యాదు చేసినా అందర్ని చంపేస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించి వదిలేశారు. ఆ వెంటనే మేము ప్రాణభయంతో హైదరాబాద్‌కు వెళ్లి డయల్ 100కి కాల్ చేశాం. ఆ తరువాతి రోజు డీజీపీ గారికి ఫిర్యాదు చేశాం. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆదివారం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై విజయ్‌కుమార్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి కేసు పూర్వ పరాలను పరిశీలించి వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.