నారాయణపేట/కోస్గి, నవంబర్ 12 : ప్రశాంతమైన పల్లెల్లో.. ఫార్మా అనే రెండు అక్షరాలు చిచ్చుపెట్టాయి. పట్టపగలే ఆ పేరు ఎత్తితే ఒకటి కాదు, రెండు కాదు ఏకం గా ఆరు గ్రామాల ప్రజలు హడలెత్తి పోతున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామం లో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలంటూ అభిప్రాయ సేకరణకు సోమవారం వచ్చిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులపై రైతులు దాడి చేశారు.
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఈ సంఘటన తర్వాత చాలా మంది గ్రామం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకున్నారు. సంఘటనతో ఎలాంటి సంబంధం లేని వారు గ్రామంలోనే ఉండిపోయారు. కలెక్టర్ స్థాయి అధికారులపై దాడి, పైగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఏమో కానీ పోలీసులు ప్రెస్టీజ్ ఇష్యుగా తీసుకున్నారు.
ఎందుకంటే పట్టపగలు కాకుండా అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఇంటర్నెట్ సేవలు బంద్ చేయించి మరీ మరీ గ్రామంలోకి వచ్చిన దాదాపు 300 మంది పోలీసులు తమ బూటు చప్పుళ్లతో గ్రామంలోని ఇంటింటినీ జల్లెడ పట్టినట్లు తెలుస్తోంది. తమ వెంట తెచ్చుకున్న లాఠీలతో గడియ పెట్టిన ఇండ్లు తెరిచే వరకు కొట్టి మరీ తెరిపించారు.
ఇంట్లో ఉన్న వాల్లను అదుపులోకి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు రోదిస్తూ వాపోయారు. అసలు తాము గొడవ వద్దకు వెళ్లలేదని, గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా పోలీస్ వాహనాలోల ఎకించుకొని వెళ్లినట్లు స్థానికంగా ఉన్న మహిళలలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్తలను, కొడుకులను ఈ అర్ధరాత్రి ఎకడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించినా..? బదులు చెప్పకుండా ఇష్టనుసారంగా, ఎవరు దొరికితే వారిని గ్రామం నుంచి తరలించినట్లు చెబుతున్నారు. ఇలా అదుపులోకి తీసుకున్న వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
లగచర్ల, రోటిబండ తండాలను ‘నమస్తే తెలంగాణ’ బృందం సందర్శించగా గ్రామంలో నిర్మానుష్య వాతావరణం కనిపించింది. గ్రామంలోని రోడ్లపై ఒకరు కూడా తిరుగుతూ కనిపించలేదు. చాలా వరకు ఇండ్లకు తాళాలు వేసి కనిపించాయి. అకడకడ ఒకటి, రెండు ఇండ్లు తెరిచి ఉన్నప్పటికీ ఆ ఇంట్లో వాళ్లు బయటికి కనిపించకుండా ఉండిపోయారు. గ్రామంలోని బడులకు సైతం సెలవు ఇవ్వడంతో రెండు పాఠశాలలకు తాళం దర్శనమిచ్చాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి సర్వే సైతం సోమవారం గ్రామంలో చేపట్టినప్పటికీ మంగళవారం మాత్రం నిర్వహించినట్లు.. సర్వే బృందాలు తిరిగినట్లు కనిపించలేదు.
తమ ప్రాణాలు పోయినా.. తమ భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పినా.. బలవంతం పెట్టి ఎలా భూములు లాక్కుంటారని, ఇది ఎంత వరకు న్యాయమని, ఫార్మా కంపెనీ ఏర్పాటుతో భూములను కోల్పోయే రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పంట పొలాలే తమకి జీవన ఆధారమని, అలాంటి భూములను లాకొని కంపెనీ ఏర్పాటు చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మా పాపకు ఆరు నెలలు. మంగళవారం అన్నప్రాసన చేద్దామని అనుకున్నాం.. కానీ రాత్రి మా ఆయన్ను పోలీసులు తీసుకెళ్లారు. కలెక్టర్, అధికారులపై స్థానికులు చేసిన గొడవలో మా ఆయన లేడు. పోలీసులతో మొరపెట్టుకున్నా వారు వినిపించుకోలేదు. ఫార్మా కంపెనీకి సంబంధించిన భూ ములు కూడా మాకు లేవు.. అని పోలీసోళ్లకు చెప్పినా వినిపించుకోలేదు.
– ఆద్విక, లగచర్ల