జడ్చర్ల, నవంబర్ 5 : జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్‌లో ఫార్మా కంపెనీలకు కొంతమంది ప్రభుత్వ ఉచిత విద్యుత్‌తో పాటు కనెక్షన్లు పొంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు లోకాయుక్త విచారణలో తేలింది. మంగళవారం జడ్చర్ల పోలేపల్లి ప్రాంతాల్లో లోకాయుక్త నియమించిన విచారణ కమిటీ వీటిని పరిశీలించింది. జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయంలో పోలేపల్లి సబ్జెక్టు సంబంధించి ఫార్మా కంపెనీల వివరాలతోపాటు సమీప గ్రామాల్లోని వ్యవసా య పొలాల వివరాలను సేకరించారు. అనంతరం పోలేపల్లి సేజ్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. ఫార్మా కంపెనీలకు సమీపంలోని ఒక్కొక్క వ్యవసాయ పొలంలో మూడు నాలుగు బోర్లను తవ్వి పొలాల్లోని పాంపాండ్లను నిర్మించి నీటిని నిల్వ చేసి ట్యాంకర్ల ద్వారా ఫార్మా కంపెనీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నేండ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుండడంతో కొంతమంది లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా సదరు అధికారుల బృందం విచారించింది. ఈ సందర్భంగా నీటిని అక్రమంగా తరలిస్తున్న ఒక ట్యాంకర్‌ను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతేకాకుండా ఈ బో ర్లకు ఉచిత కనెక్షన్లు ఎందుకిచ్చారంటూ విద్యుత్ శాఖ ఏఈని ప్రశ్నించారు. అ యితే తాను కొత్తగా వచ్చానని చెప్పగా.. కొత్తగా వస్తే జీతం తీసుకోవా అంటూ లోకాయుక్త విచారణ బృందం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్దఎత్తున నీటి వ్యాపారం చేస్తూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ రెవెన్యూ అధికారులనూ ప్రశ్నించింది. ఈ తతంగం మొత్తాన్ని ఫొటోలు వీడియోలు తీసి రికార్డు చేశారు. సమీ ప పొలాల యజమానుల వివరాలతోపాటు ఎన్ని బోర్లు వేశారు? ఎంత నీటిని అమ్మి సొమ్ము చేసుకున్నారనే విషయాన్ని పరిశీలించారు. కొన్నేండ్లుగా సాగుతున్న వ్యవహారంపై ఎంత విద్యుత్ భారం ప్రభుత్వంపై పడిందో ఆ లెక్కలన్నింటినీ తీయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
ఫార్మా కంపెనీల పరిశీలన..
పోలేపల్లి సెజ్‌లోని పలు కంపెనీలను విచారణ బృందం పరిశీలించింది. సమీప పొలాల నుంచి అక్రమంగా నీటిని తీసుకోవడమే కాకుండా.. కంపెనీ వ్యర్థాలను అడ్డగోలుగా పొలాల్లోకి.. చెరువులు, కుంటల్లోకి వదులుతున్న వైనా న్ని కూడా పరిశీలించింది. అయితే లోకాయుక్త విచారణ బృందం వచ్చింద న్న విషయం తెలియగానే ఫార్మా కంపెనీలన్నీ గుట్టుగా నీటిని తరలించేందుకు ఏర్పాటు కాగా పోలేపల్లి మాజీ సర్పంచ్ ఏకంగా తన పొలంలో కిలోమీటరు దూరం వరకు వేసిన పైప్‌లైన్ ప్రాంతాలను పరిశీలించారు.
అప్పటివరకు మీడియాను అనుమతించిన విచారణ బృందం ఫార్మా కంపెనీలకు వెళ్లగానే అక్కడి సిబ్బంది మీడియాను అడ్డుకున్నారు. మొత్తంపైన పోలేపల్లి ఫార్మా కంపెనీలకు అక్రమంగా నీటి తరలింపుతో ఇటు విద్యుత్శాఖతోపాటు అటు రెవెన్యూ విభాగానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. భూగర్భ జలాలు కూడా భారీస్థాయిలో పడిపోయే ప్రమాదం ఉందని విచారణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కొంతమంది అక్రమంగా బోర్లు వేసి గత కొన్నేండ్లుగా రూ.లక్షలు సంపాదించినట్లు విచారణలో తేలడంతో ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొన్నది. లోకాయుక్త విచారణ బృందం వచ్చిందని తెలియగానే జడ్చర్లతోపాటు మిగతా చోట్లా అంత గప్‌చుప్ అయ్యారు. ఈ విచారణలో విచారణ అధికారి మ్యాత్యుకోశితోపాటు శివప్రసాద్, రామ్‌రెడ్డి ఉన్నారు.
అక్రమ నీటి తరలింపు నిజమే : విచారణ కమిటీ వెల్లడి
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి ఫార్మా కంపెనీలకు సమీప పొలాల నుంచి దాదాపు 20నుంచి 25 బోర్లు వేసి పెద్దపెద్ద నీటి ట్యాంకులను ఏర్పాటు చేసి ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని లోకాయుక్త విచారణ కమిటీ అధికారి మ్యాత్యుకోశి వెల్లడించారు. జడ్చర్లలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడుతూ పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను తరలిస్తున్నారని ఫిర్యాదులపై విచారణ చేయడానికి వచ్చామన్నారు. సెజ్ సమీపంలో పొలాల్లో దాదాపు 20నుంచి 25 దాకా బోర్లను వేసి వాటికి ఒకే కరెంట్ కలెక్షన్ తీసుకొని మూడు నాలుగు నీటి కుంటలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారని తేలిందన్నారు.
గతంలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ఐదుగురు అధికారుల కమిటీ విచారణ జరిపి దాదాపు 13 బోర్లను సీజ్ చేసిందని.. అయితే ఆ బోర్లన్నీ నడుస్తున్నాయని దాంతో పాటు మరికొన్ని బోర్లు వేసి భూగర్భ జలాలను పెద్ద ఎత్తున బయటికి తీసి కంపెనీలకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఓ ఫార్మా కంపెనీకి మాజీ సర్పంచ్ ఏకంగా కిలోమీటరు వరకు పైప్‌లైన్ వేసి నీటిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేస్తామని అయితే విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన ఆ శాఖ, ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదు అన్నా రు. నిబంధనలకు విరుద్ధంగా అన్ని బోర్లు వే యడానికి రెవెన్యూ అధికారులు పర్మిషనెలా ఇచ్చారో కూడా తేలాల్సి ఉందన్నారు. సమావేశంలో లోకాయుక్త విచారణ కమిటీ సభ్యుడు శివప్రసాద్ రామ్‌రెడ్డి ఉన్నారు.