నకిలీ విత్తన విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొందరు దళారులు అమాయక రైతులను ఆసరాగా చేసుకొని నాసిరకం విత్తనాలను అంటగడుతుంటారు. ఇలాంటి వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలను అందించాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని ఆదేశించారు. దీంతో వ్యవసాయ అధికారులతోపాటుపోలీసులు రంగంలోకి దిగారు. ప్రణాళిక రూపొందించుకొని ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు చేస్తున్నారు.
వనపర్తి, మే 19 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ దిశగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అన్న స్థాయి నుంచి.. నేడు వ్యవసాయం పండుగ అని నిరూపించే స్థాయికి ఎదిగింది. దేశానికి తెలంగాణ ధాన్యభాండాగారంగా మారింది. సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో కేటుగాళ్లు నకిలీ విత్తనాల అవతారమెత్తారు. వివిధ కంపెనీలు మార్కెట్లోకి నకిలీ విత్తనాలను తీసకొస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు అటు పోలీసు శాఖ.. ఇటు వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టడి చర్యలను తీసుకుంటున్నది. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకుగానూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. కలెక్టర్లు, పోలీసులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. పంటల సాగు విషయంలో విత్తనమే ప్రధానమైనందున.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వివిధ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నది. అధిక లాభాలకు ఆశపడి డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా నకిలీలను రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు దిగుబడి రాక నష్టపోతున్నారు. అక్రమాలకు పాల్పడే డీలర్లకు చెక్ పెట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు చర్యలను చేపట్టింది. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి విత్తనాలు వాడాలి..? క్యూ ఆర్ కోడ్ ఉన్న విత్తన ప్యాకెట్లనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కొనుగోలు సమయంలో రైతులకు విధిగా రసీదు ఇవ్వాలని డీలర్లను ఆదేశిస్తున్నారు. ఎరువులను ఈ-పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఇవ్వాలని, నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి
విత్తనాలను కొనుగోలు చేయాలనుకుంటే లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దకే వెళ్లాలి. పేరుగాంచిన కంపెనీల విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. క్యూఆర్ కోడ్, ప్యాకింగ్ ఉన్న విత్తనాలను మాత్రమే వినియోగించాలి. ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు. కాసులకు కక్కుర్తి పడి డీలర్లు నకిలీ వాటిని విక్రయించి రైతుల పాపం మూటగట్టుకోవద్దు.