ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ చెక్‌పోస్టు సమీపంలో స్పీడ్ బ్రేకర్లను ( Speed breakers ) ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని ఎంపీజే జిల్లా అధ్యక్షుడు ఖాజీమ్ హుస్సేన్, నారాయణపేట పట్టణ అధ్యక్షుడు సాజిద్ సిద్ధికీ డిమాండ్ చేశారు. ఆర్అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణకు సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఊట్కూర్ మండల కేంద్రం నుంచి మక్తల్, నారాయణపేట పట్టణాలకు వెళ్లే క్రమంలో చెక్ పోస్ట్ మలుపుల వద్ద వేగ నిరోధకాలను ఏర్పాటు చేయకపోవడంతో వాహనాచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సందర్భాలలో చెక్‌పోస్టు క్రాస్ రోడ్డులో వాహనాలు ఢీకొట్టుకుని యువకులు మృతి చెందిన సంఘటనలున్నాయని వివరించారు. స్పందించిన ఈఈ విచారణ చేపట్టి స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.