 
                                                            మహబూబ్‌నగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్లో ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనడం.. లక్కీడిప్‌లో మద్యం షాపు అలాట్ కావడం.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ చర్యలకు దిగుతు న్న సమయంలో కాంగ్రెస్ నేతలు ఎంటరై లైసెన్స్ ఫీజు చెల్లించడంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ని బంధనలకు విరుద్ధంగా ఒక ఉద్యోగి మ ద్యం టెండర్లను పాల్గొనడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఉన్నతాధికారులకు స మాచారం ఇవ్వకుండా సెలవు పెట్టి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ప్రత్యక్షం కావడం.. కలెక్టర్ చేతుల మీదుగా తీసిన లక్కీడీప్‌లో సదరు ఉద్యోగికి మద్యం షాపు దక్కింది. ఆ తర్వాత షాపు దక్కినట్లు రిజిస్టర్లో సంతకం కూడా చేయడం గమనార్హం.
ఈ వ్యవహారం బయటపడటంతో కొంతమంది విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతుండగానే కాంగ్రెస్ నేతలు ఎంటర్ అయి ఓ ప్రజాప్రతినిధితో సంప్రదింపులు జరిపి మద్యం షాపు దక్కిన ప్రభుత్వ ఉద్యోగిని పేరు మీద లైసెన్స్ ఫీజు చెల్లించడం చకచకా జరిగిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుమారం లేపుతోంది. మరోవైపు విద్యాశాఖ అధికారులు మద్యం షాపు దక్కించుకున్న ప్రభుత్వ ఉద్యోగినిపై విచారణ ప్రారంభించారు. విచారణ జరుగుతుండగానే ఏకంగా లైసెన్స్ ఫీజు రూ.10, 83,500 ఉద్యోగి పేరుపై ఎక్సైజ్ శాఖకు చాలన్ రూపంలో వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక ఉద్యోగి మద్యం టెండర్లను పాల్గొనడం లక్కీడీప్‌లో దక్కడం ఆ షాపుపై లైసెన్స్ ఫీజు చెల్లించడంతో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ వెనకాడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల మ ద్యం షాపులకు టెండర్లు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని షాప్ నెంబర్ 16 ధర్మాపూర్ వైన్ షాపు కోసం 29మంది పోటీ పడ్డారు. అయితే అప్పటికే జిల్లా కేంద్రంలోని రాంనగర్ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న పుష్ప టోకెన్ నెంబర్ 17లో రూ.3 లక్షల డీడీ చెల్లించి టెండర్లో పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా కలెక్టర్ విజయేంద్రబోయి తీసిన లక్కీడీప్‌లో ప్రభుత్వ పీఈటీగా పనిచేస్తున్న భూపాని పుష్పకు దక్కింది.
దీంతో ఎక్సైజ్ అధికారులు రిజిస్టర్లో ఆమెకు దక్కిన వైన్‌షాప్ టోకెన్ నెంబర్ ఎంట్రీ చేసి సంతకం కూడా చేయించుకున్నారు. దీంతో కంగుతిన్న కొందరు ఈమె ప్ర భుత్వ ఉద్యోగి అని.. ఎలా పాల్గొంటుందని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్‌కు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎంఈవో పాఠశాలలో వెళ్లి తనిఖీ చేయగా టెండరింగ్ రోజు సెలవు పెట్టినట్లు ధ్రువీకరించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ మద్యం టెండర్లలో పాల్గొన్నదని చెప్పి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. దీనిపై విద్యాశాఖ చర్యలకు ఉపక్రమిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు ఎంటరయ్యారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో షాప్ నంబర్ 16 ధర్మాపూర్ వైన్ షాపు వ్యవహారానికి రాజకీయ రంగు పులుముక్కుంది. టెండర్ల ని బంధనలకు విరుద్ధంగా పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయినిని రక్షించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి మద్యం టెండర్లను పాల్గొనడం నిబంధనలకు వి రుద్ధం అని తెలిసిన ఎక్సైజ్ శాఖ, కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సెలవు పెట్టి మరి టెండర్లలో పాల్గొనడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
అయితే ప్రభుత్వ ఉద్యోగికి దక్కిన మద్యం షాపును కాంగ్రెస్ నేతలు కొందరు హస్తగతం చేసుకున్నారు. అంతేకాకుండా వెంటనే ప్రభుత్వ ఉద్యోగి పేరుపైన లైసెన్స్ ఫీజులు కూడా చెల్లించారు. నెంబర్ MBN016చాలాన్ నెంబర్ 6502798682తో తేదీ 28.10.2025 రోజు రూ. 10,83,500 ద్వారా ప్రభుత్వ ఉద్యోగి పేరు మీద చెల్లింపులు జరిగాయి. దీంతో అధికార పార్టీ నేతలు కలెక్టర్‌తోపాటు ఎక్సైజ్ అధికారులపై ఓ మంత్రి ద్వారా ఒత్తిడి చేయించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు ఏమి చేయలేక పోతున్నారు.
జిల్లా కేంద్రంలోని ఒక మద్యం షాపు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీకీ దక్కడం.. సర్వీసు రూల్ నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నదని తెలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు తలదూర్చడంతో డీఈవోపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. విచారణ జరిపిన రిపోర్ట్ ఇవ్వకుండా తొక్కి పెట్టారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారం వెనుక ఉండి నడిపిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ వైన్‌షాపు ప్రభుత్వ ఉద్యోగి దక్కించుకున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే ఏమైందో ఏమో కానీ విచారణ పేరుతో కాలయాపన చేస్తుండడం.. ఈలోపు ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ నుంచి ఫోన్ రావడంతో ఉన్నతాధికారులు సైలెంట్ అయిపోయారు. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ మద్యం టెండర్లను పాల్గొన కూడదు. ఒకవేళ పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏకంగా లక్కీడీప్‌లో తగిలిన మద్యం షాపును అలాట్ చేస్తూ.. లైసెన్స్ ఫీజు చెల్లించిన సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతుంది. వాస్తవంగా షాపు దక్కించుకున్న దాన్ని తిరిగి రద్దు చేసుకుంటే రూ. ఐదు లక్షలు కట్టాలి.. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం టెండర్లను పాల్గొన్న సదరు ప్రభుత్వ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ కూడా చేయాల్సి ఉంటుంది.. ఇవన్నీ ఏమి జరగకుండా కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అన్ని చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మద్యం టెండర్ల గోల్‌మాల్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ టెండర్లో పాల్గొన్న ఉపాధ్యాయురాలిపై విచారణ చేపట్టాం.. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను క్రోడీకరించి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశాం. జిల్లా రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం.
– లక్ష్మణ్‌సింగ్, మండల విద్యాధికారి మహబూబ్‌నగర్
 
                            