‘జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైల స్తుతే’ సర్వ మంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమిని జరుపుకొంటారు. శనివారం పండుగకు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సన్నద్ధమయ్యారు. ఈరోజు శమీ వృక్షానికి పూజలు చేసిన అనంతరం ప్రజలు పాలపిట్టను దర్శించుకోనున్నారు. అలాగే రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహి ంచేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇప్పటికే ప్రతి ఇల్లు పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. మార్కెట్లన్నీ సందడిగా మారాయి.
సరదాల దసరా.. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగను శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఊ రూవాడా సిద్ధమైంది. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచిపెట్టే పర్వదినం. ఈరోజు ఇంటిల్లిపాది నూతన వస్ర్తాలు ధరించి సంతోషంగా జరుపుకోనున్నారు. వివిధ రకాల పిండివంటలు వండనున్నారు.
దేవీ శరన్నవరాత్రి వేడుకలు శనివారంతో ముగియనున్నాయి. 9 రోజులపాటు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ చివరి రోజు మహిషాసురమర్ధిని రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నది. ఉత్సవాల సందర్భంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పల్లె, పట్టణాల్లో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. నగరాలు, పట్టణాల నుంచి ఆడపడుచులు, బంధువులు తరలిరావడంతో గ్రామాలు కళకళలాడుతూ పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
పాండవులు వనవాసం వెళ్లి వచ్చి జమ్మి వృక్షంపై వారి ఆయుధాలు తీసిన రోజున దసరా పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున అంతా మంచే జరగాలని వృత్తిదారులు వారి పరికరాలకు వాహనాలకు, యం త్రాలకు ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీ. శమీ వృక్ష కొమ్మలను తెంచి ఆలయాలను దర్శించుకొని పెద్దవారికి, తోటి వారికి అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కాగా వానకాలం సీజన్లో సాగు చేసిన పంటలు దసరా నాటికి రైతుల ఇండ్లకు చేరుతాయి. ఈ వచ్చిన ధాన్యం, పంటను దేవతలకు నైవేద్యంగా పెట్టి.. తర్వాత తినేందుకు.. విక్రయించేందుకు సిద్ధమవుతారు.
దసరా పండుగను పురస్కరించుకొని మార్కెట్కు పండుగ కళ వచ్చింది. ఐదు జిల్లాల్లోని దుకాణాల్లో సామాగ్రి కొనుగోళ్లు చేయడంలో జనం బిజీబిజీగా గడిపారు. షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోగా.. పూలకు గిరాకీ పెరిగింది. కిరాణం, బట్టల, బంగారం, టైలరింగ్, పూజా సామగ్రి దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. బంతిపూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ధర రూ.150 వరకు పలుకుతున్నాయి. వాహనాలు, బస్సుల రాకపోకలు పెరగడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. మామిడి తోరణాలు, బంతిపూలు, గుమ్మడి కాయలకు డిమాండ్ నెలకొన్నది. నిన్న, మొన్నటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న మార్కెట్లు నేడు కళకళలాడుతున్నాయి.