గద్వాలటౌన్, సెప్టెంబర్ 19 : కృష్ణానదిపై నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బ్రిడ్జిని గద్వాల మండలం కొత్తపల్లి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల మధ్య నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి, రేకులపల్లి, శెట్టి ఆత్మకూరు, గుంటిపల్లి, చెనుగోనుపల్లి గ్రామాలతోపాటు గద్వాల ప్రజలు శుక్రవారం రొడ్డెక్కారు. ఆయా గ్రామాల ప్రజలందరూ కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధానదారుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే పాతబస్టాండ్‌లో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ కొత్తపల్లి, జూరాల మీదుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల జిల్లా కేంద్రంతోపాటు నది ఇరువైపులా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అంతేకాక హైదరాబాద్ వంటి నగరాలకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. జిల్లా కేంద్రం సమీపాన ఉన్న కొత్తపల్లి గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రెండు గ్రామాల అభివృద్ధి కోసం ఆరాట పడడం కాదని రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు.
కొందరు నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత సరిత పచ్చని గ్రామాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వెంటనే అట్టి చర్యలను విరమించుకోవాలని హితవు పలికారు. బ్రిడ్జిని సాధించుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి, రేకులపల్లి, గుంటిపల్లి, చెనుగోనిపల్లి, శెట్టిఆత్మకూర్, గద్వాల ప్రజలు అశోక్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, హనుమంత్‌రెడ్డి, పాల్సుధాకర్, శివప్ప, పాపిరెడ్డి , భూపాల్‌రెడ్డి, రఘవర్ధన్రెడ్డితోపాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.