అయిజ, మే 27 : మంచినీటి కష్టాలతో పల్లెల్లో ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో పలు గ్రామవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేయించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయిజ మండలం భూంపురంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీటిని అందించేందుకు పైప్లైన్లు, ఇంటింటికీ నల్లాలు అమర్చి సరఫరా చేశారు.
సర్పంచుల పదవీకాలం పూర్తయ్యాక.. అధికారుల అలసత్వం కారణంగా నీళ్లు అంతంత మాత్రమే ట్యాంకులకు చేరుతున్నది. దీంతో కొద్దిపాటి నీరు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నల్లాలకు మోటార్లు బిగించడంతో నీటి కొరత తీవ్రమైంది. అది కూడా రెండ్రోజులకోసారి సరఫరాతో నీటి సమస్య జఠిలమైనది. ఓహెచ్ఆర్ ట్యాంకులకు నీళ్లు చేరకపోవడంతో మినీ ట్యాంకులకు మోటార్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
భగీరథ పైప్లైన్ చివరన భూంపురం గ్రామం ఉండటంతో నీళ్లు అందడం లేదు. 40 కేఎల్ ఓహెచ్ఆర్, 20 కేఎల్ ఓహెచ్ఆర్ ట్యాంకులతోపాటు 10 కేఎల్ మినీ ట్యాంకులు ఉన్నాయి. అయితే భగీరథ నీరు అంతంత మాత్రమే వస్తుండడంతో ఓహెచ్ఆర్ ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. దీంతో వర్షాలు కురుస్తున్న తాగునీటికి మాత్రం కష్టాలు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్య నుంచి తమను గట్టెక్కించాలని కోరుతున్నారు.
నీటి సరఫరాకు చర్యలు
మండలంలోని భూంపురం గ్రామానికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 20 కేఎల్, 10 కేఎల్ ట్యాంకులకు మాత్రమే మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. గ్రిడ్ అధికారులతో నీటి సరఫరాపై చర్చించాం. గ్రిడ్ అధికారులు నీటి సరఫరాను పుష్కలంగా అందించేందుకు బూస్లర్ పంపును ఎగువన బిగించి భూంపురం, మూగోనిపల్లి గ్రామాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. సమస్య జఠిలం కాకుండా చర్యలు చేపడుతాం.
– సందీప్కుమార్రెడ్డి, ఏఈ ఇంట్రా, అయిజ