కోడేరు, మే 16 : వలసలు తగ్గించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఉపాధి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పూట గడవాలంటే ఉపాధి పనులకు వెళ్లక తప్పని కూలీలు అసౌకర్యాల లేమితో ఎండలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చెరువుల్లో పూడికతీసే పనులతోపాటు కాల్వల పూడికతీత, రైతుల పొలాల్లో కట్టలు వేయటం వంటి పనులు చేపడుతున్నారు. ఎర్రటి ఎండలో చెమటోడ్చి పనిచేసిన వారికి గొంతు తడార్పుకునేందుకు మంచినీళ్లు, కాసేపు సేద తీరటానికి నిలువ నీడ లేని దుస్థితి నెలకొన్నది. ఇంకుడుగుంతలు, పశువుల షెడ్లు, నీటి తొట్లు, నర్సరీల ఏర్పాటు, చెక్‌డ్యాంలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణం, నీటిపారుదల కాల్వల్లో పూడికతీత, పొలాలకు అనుసంధాన రోడ్లు, నీటికుంటల నిర్మాణం, హరితహారం మొక్కలకు కంచె ఏర్పాటు, నీళ్లు పోసే పనులకు ప్రాధాన్యమిచ్చారు. భానుడు భగభగ మండుతుండటంతో కూలీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనులు చేయాల్సి వస్తున్నదని పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనుల వివరాలు ఇలా..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 466 గ్రామ పంచాయతీల్లో మొత్తం 1.95లక్షల ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు ఉండగా, 3.75లక్షల మంది ఉపాధి కూలీలను అధికారు లు గుర్తించారు. అందులో 1.73లక్షల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. ఎస్సీలు 26.74 శాతం ఉండగా, ఎస్టీలు 17.21శాతం ఉన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.20.18లక్షల బడ్జెట్‌ను కేలాయించా రు. గతేడాది 2024-25 సంవత్సరానికి రూ.36.45లక్షల నిధులను కేటాయించారు. బీఆర్ఎస్ పాలనలో కూలీలకు సేద తీరటానికి టెంట్లు ఏర్పాటు చేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలుఎ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని కూలీలకు వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అసౌకర్యాల మధ్యే..
నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు, అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ కానరావడం లేదు. కనీసం తాగునీళ్లు లేక కూలీలు తమ వెంట నీళ్ల బాటిళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కూలీలకు అత్యవసర సమయాల్లో ఉపయోగించే మెడికల్ కిట్లను అందించాల్సి ఉండగా, అదికారులు గతేడాది నుంచి అటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై వడదెబ్బ లక్షణాలతో మృతిచెందిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. అంతేకాకుండా పని ప్రాంతాల్లో తేళ్లు, పాముకాట్లకు గురవుతున్నారు. అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స కిట్లు లేక కూలీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనిచేయాల్సి వస్తున్నది. పనులకు వచ్చే వారికి రూ.300 కూలీ ఇవ్వాల్సి ఉన్నది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు కూలీ రూ.150 నుంచి రూ.200వరకు అందుతుందని వాపోతున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. కూలీలు పని చేసేచోట తాగునీరు సరఫరా చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించాం. నీడ కోసం ఏర్పాటు చేసే టెంట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కూలీలకు పనిచేసే చోట మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రథమ చికిత్స కోసం అవసరమయ్యే సామగ్రిని అందిస్తాం. ఎండల నుంచి రక్షణ కల్పించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తాం. వడదెబ్బ తగలకుండా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో, కోడేరు
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండాకాలం కూలీలు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11గంటల
వరకే పనులు ముగించుకోవాలి. తలకు ఎండ తగలకుండా టవల్ చుట్టుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తెల్లటి కాటన్ దస్తులు వేసుకోవాలి. ఎండల వల్ల వడదెబ్బకు గురైతే ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కోకతప్పదు.
– అనిల్‌కుమార్, వైద్యాధికారి, కోడేరు