నాగర్‌కర్నూల్, జూలై 4 : ఓ రైతు బతికి ఉండగానే మృతిచెందినట్లు చిత్రీకరించి తప్పుడు పత్రాలు పుట్టించి, ఆ రైతుకు తెలియకుండానే ఆయన పేరున ఉన్న పట్టా భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనాలకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పందించారు. ఇందుకు కారణమైన కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించడంతోపాటు, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టా భూమి అసైన్డ్గా నమోదు చేయడానికి కారణమైన తాసీల్దార్ సస్పెండ్ చేశారు.
అచ్చంపేట మండలంలోని హాజీపూర్‌కు చెందిన రైతు జంచుక మశన్న బతికి ఉండగానే మృతిచెందినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, ఆయనకు తెలియకుండానే అతని భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్పు చేయడంతో సదరు రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయి లో కలెక్టర్ విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాల ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు పాత్రదారులైన భూభారతి ఆపరేటర్ ముడావత్ జైపాల్‌ను తొలగిస్తూ, క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనంతటికి బాధ్యుడైన తాసీల్దార్ అశోక్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటన జరిగిన సమయంలో అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసీల్దార్‌గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం పెద్దకొత్తపల్లి తాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై తాసీల్దార్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వారసత్వ మార్పిడి కేసుల్లో దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉండగా అశోక్‌కుమార్ వాటిని పరిశీలించకుండా వారసత్వ మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడంతో నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతు భూహక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, నిబంధనల అమలు తప్పనిసరి అని, నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.