కొల్లాపూర్, జూలై 11: శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మా పిల్లలను పంపించి ప్రాణాలపైకి తెచ్చుకోమని, నూతన పాఠశాలను నిర్మిస్తేనే తమ పిల్లలను స్కూల్కు పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నార్లాపూర్ మండల ప్రజా పరిషత్ ప్రైమరీ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం సదురు పాఠశాలలోని నాలుగో తరగతి క్లాస్ రూం పైకప్పు కూలడంతో త్రుటిలో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలతో కలిసి శిథిలావస్థకు చేరిన పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఎన్నోసార్లు శిథిలావస్థకు చేరిన పాఠశాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేయడం మూలంగానే నేడు విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందనే భయంతోనే ఈ ఏడాది తమ పిల్లలను పాఠశాలకు పంపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే శిథిలావస్థకు చేరిన భవనంలో నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టకపోతే గ్రామంలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు పుట్ట నిరంజన్, కిరణ్ కుమార్, ఆశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.