మాగనూరు, అక్టోబర్ 1 : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు దాటినప్పటికీ గ్రామాల్లో రాజకీయ పార్టీలు, నాయకల ఫ్లెక్సీలు గ్రూపుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రచారాలు చేస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న ఘటనలు మాగనూరు మండలంలో చోటు చేసుకుంటున్నాయి. మాగనూరు మండలకేంద్రంతోపాటు మండలంలో ఎకడా ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల కోడ్ వస్తే గ్రామా ల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాములు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ తను విధులు నిర్వహిస్తున్న గ్రామంలోని ‘మన జన్మస్థలం బైరంపల్లి’ అనే గ్రూపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మన ఊరి ఇందిరమ్మ ఇండ్లుకు రెండు బేస్మెంట్ బిల్లులు వచ్చాయని కావలి కవిత భర్త ఆనంద్‌కు, పూజారి శోభ భర్త బస్వరాజుకు ఒక లక్ష రూపాయలు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎలాంటి సందేహాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని గ్రూపులో పోస్ట్ చేయడం గమర్హం.
గ్రామ అధికారే ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా అవేమీ పట్టనట్లు గ్రూపుల్లో యథేచ్ఛగా పోస్టులు పెడుతూ కోడ్‌ను ఉల్లంఘించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా గ్రామాల్లో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా గ్రామాల్లో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్న పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడం శోచనీయం.
కాగా ఎంపీడీవో శ్రీనివాసులును పంచాయతీ కార్యదర్శి తీరుపై వివరణ కోరగా.. విచారణ జరిపి తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.